బోథ్, ముద్ర:
జిల్లాలోని నిరుద్యోగ యువతకు వివిధ రంగాలలో ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ఈ నెల 15వ తేదీన ఉట్నూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల వేదికగా భారీ మెగా జాబ్ డ్రైవ్-2026 ను నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాజర్షిషా తెలిపారు. సోమవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో మెగా జాబ్ డ్రైవ్-2026′ కు సంబంధించిన పోస్టర్ ను ఆయన అధికారులతో కలిసి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా యంత్రాంగం, ఐటిడిఎ ఉట్నూర్ సహకారంతో మ్యాజిక్ బస్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ ఉపాధి మేళా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ మేళాలో టెక్ మహీంద్రా, హెటెరో, అపోలో ఫార్మసీ, ముత్తూట్ ఫైనాన్స్, స్టార్టెక్ వంటి సుమారు 20కి పైగా ప్రముఖ కంపెనీలు పాల్గొంటున్నాయని వారు పేర్కొన్నారు. ఫైనాన్స్, మార్కెటింగ్, హెచ్.ఆర్, ఫార్మసీ విభాగాల్లో వందలాది ఖాళీలను భర్తీ చేయనున్నట్లు వివరించారు. ఇంటర్మీడియట్, డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అభ్యర్థులందరూ ఈ అవకాశానికి అర్హులని, ఎంపికైన వారికి స్థానిక ప్రాంతాలతో పాటు ఇతర ప్రధాన నగరాల్లోనూ ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 15వ తేదీన (శుక్రవారం) ఉదయం 10 గంటలకు తమ విద్యార్హత ధ్రువపత్రాలతో ఉట్నూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు* హాజరుకావాలని కోరారు. ఏజెన్సీ ప్రాంత నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థాయిలో స్థిరపడాలని, ఇతర సమాచారం కోసం 9989717139, 9494559027, 9553141962 ఫోన్ నంబర్లలో సంప్రదించవచ్చని సూచించారు. ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ప్రతాప్ సింగ్, ఇతర అధికారులు, పాల్గొన్నారు.