Take a fresh look at your lifestyle.

కాంగ్రెస్ అభయ హస్తం… ప్రజల పాలిట భస్మాసుర హస్తంగా మారింది – కేటీఆర్

 

  • ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో…అర గ్యారెంటీ కూడా అమలు చేయలేదు
  • రాష్ట్రంలోని ప్రతి రైతుకు ఎకరాకు రేవంత్ ప్రభుత్వం రూ. 17,500 బాకీ పడింది
  • ఈ నెల 26 నుంచి కౌలు రైతులకు కూడా రైతుబంధు ఇవ్వడంతో పాటు ఎకరాకు రూ. 15 వేలు రైతుబంధు ఇవ్వాలి
  • రాష్ట్రంలోని ప్రతి వర్గాన్ని మోసం చేసిన రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ పై చీటింగ్ కేసులు పెట్టాలి.
  • త్వరలోనే పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉపఎన్నికలు
  • 21 న నల్లగొండలో రైతు ధర్నా- ఆ తరువాత మిగతా జిల్లాలోనూ రైతు దీక్ష సభలు
  • షాబాద్ రైతు దీక్ష కు భారీగా తరలివచ్చిన అన్నదాతలను ఉద్దేశించి ప్రసంగించిన కేటీఆర్
  
ముద్ర, తెలంగాణ బ్యూరో :- కాంగ్రెస్ అభయహస్తం రాష్ట్ర ప్రజల పాలిట భస్మాసుర హస్తంలా మారిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు.  కాంగ్రెస్ ఇచ్చిన  ఆరు గ్యారెంటీల్లో అర గ్యారెంటీ కూడా సరిగా అమలుచేయకుండానే, అన్నీ చేశామని ఢిల్లీలో రేవంత్ గప్పాలు కొడుతున్నారని విమర్శించారు. కన్నతల్లికి అన్నం పెట్టనోడు చిన్నమ్మకు బిర్యాని పెడతా అన్నట్టుగా రేవంత్ పాలన ఉందని మండిపడ్డారు. రాష్ట్రంలో  ఒక్క హామిని కూడా అమలుచేయకుండానే ఢిల్లీలో అమలు చేయించే గ్యారెంటీ తనదే అని రేవంత్ చెప్పుకోవడం పెద్ద జోక్ గా అభివర్ణించారు. 
శుక్రవారం చేవేళ్ల నియోజకవర్గం షాబాద్ లో  నిర్వహించిన రైతు దీక్షలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, రాష్ట్రంలోని ప్రతి రైతుకు ఎకరాకు రూ. 17,500ల చొప్పున రేవంత్ బాకీ ఉన్నారన్నారు.  కేవలం రైతులనే కాకుండా రాష్ట్రంలోని అన్ని వర్గాలను మోసం చేసిన రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి మీద ప్రజలు చీటింగ్ కేసులు పెట్టాలన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన అబద్దపు హామీలని నమ్మి ఓట్లేసిన ప్రజలు ఇప్పుడు రేవంత్ రెడ్డిని ఇష్టం వచ్చినట్టు తిడుతున్నారన్నారు. ఆయనకు సిగ్గు, శరం లేవు కాబట్టి వాటిని పట్టించుకోకుండా ఇంకా పచ్చి అబద్దాలు చెప్పుకుంటూ పోతున్నారని కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.  తాను ముఖ్యమంత్రి కాగానే రూ. 2 లక్షల రుణమాఫీ ఫైల్ మీద సంతంకం పెడతా అన్నారన్నారు. కానీ రేవంత్ సొంతూరు కొండారెడ్డి పల్లెలో అయినా, కొడంగల్ నియోజకవర్గంలో అయినా వందకు వంద శాతం రుణమాఫీ అయినట్టు నిరూపిస్తే తనతో పాటు రాజకీయ సన్యాసం తీసుకుంటానని అసెంబ్లీలో ఛాలెంజ్ చేశానని కేటీఆర్ ఈ సందర్భంగా గుర్ు చేశారు. తాను విసిరిన ఛాలెంజ్ పై ఇప్పటి వరకు  రేవంత్ రెడ్డి సప్పుడు చేయలేదన్నారు. 
సీఎంగా కేసీఆర్  ఉన్నప్పడు నాట్లప్పుడు పైసలు పడితే, ఇప్పుడు ఓట్లప్పుడు మాత్రమే ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం పైసలు ఇస్తుంది ఎద్దేవా చేశారు. మొన్న పార్లమెంట్ ఎన్నికలప్పుడు రైతు బంధు ఇచ్చి చేతులు దులుపుకున్నారని మండిపడ్డారు.  ఆ తరువాత నుంచి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. రైతుబంధు పది వేలు కాదు పదిహేను వేలు ఇస్తానని ఎన్నికల ప్రచారంలో హామి ఇచ్చిన రేవంత్ రెడ్డి….ఈ నెల రి 26 నుంచి 12 వేల రూపాయలు కాకుండా రైతుబంధు కింద 15 వేలు ఇవ్వాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఇంతేకాదు 22 లక్షల మంది కౌలు రైతులకు కూడా రైతు బంధు ఇవ్వకుంటే వదిలిపెట్టే ప్రస్తకే లేదన్నారు. దాంతో పాటు వానకాలం నాటికి వేయాల్సిన రైతుబంధు పైసల్ని కూడా ప్రభుత్వం రైతులకు ఇవ్వాలన్నారు.
అధికారంలోకి రాకముందు మూడు పంటలకు రైతుబంధు ఇవ్వాలన్న రేవంత్ రెడ్డి ఇప్పుడు ఆ పని చేయాలని డిమాండ్ చేశారు.  త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓట్లు అడగడానికి వచ్చే కాంగ్రెస్ నాయకుల గల్లా పట్టుకొని రూ. 17,500 రూపాయలు అడగాలని రైతులకు కేటీఆర్ పిలుపునిచ్చారు. అన్న వస్త్రం కోసం పోతే ఉన్నవస్త్రం పోతుందన్న ఎన్నికల ముందు కేసీఆర్  అన్న మాటలు ఇవాళ నిజం అయ్యాయన్నారు. కాంగ్రెస్ అబద్దపు హామీలను నమ్మి తెలంగాణ ప్రజలు మోసపోయారన్నారు. 
రాష్ట్రంలోని కోటి 60 లక్షల ఆడబిడ్డలకు రేవంత్ రెడ్డి నెలకు రూ. 2వేల చొప్పున ఒక సంవత్సరంలో రూ. 30 వేలు  బాకీ ఉన్నాడన్నారు.  ఓట్లు అడగడానికి వచ్చే కాంగ్రెస్ నాయకులు ముందుగా తమ బాకీ తీర్చాలని ఆడబిడ్డలు నిలదీయాలని సూచించారు.  కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినంక రాష్ట్రంలో దాదాపు 5 లక్షల పెళ్లిల్లు అయ్యాయని….వారందరికి తులం బంగారం దొరకడం లేదా అని ప్రశ్నించారు. పెళ్లిళ్లు చేసుకున్న ఆ ఐదు లక్షల ఆడబిడ్డలకు రేవంత్ రెడ్డి తులం బంగారం అంటే దాదాపు  రూ.70 వేల చొప్పున బాకీ ఉన్నడని చెప్పారు. 
రైతు భరోసా ఇవ్వనందుకు, రుణమాఫీ అని మోసం చేసినందుకు, 2500 అని ఆడబిడ్డలను మోసం చేసినందుకు, ఆరు గ్యారెంటీలను అమలు చేయనందుకు, భూములు ఇవ్వమన్న పాపానికి అన్యాయంగా లగచర్ల రైతులను జైల్లో వేసినందుకు, హీర్యా నాయక్ అనే రైతుకు గుండెపోటు వస్తే బేడీలు వేసి హాస్పటల్ తీసుకపోయినందుకు, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో   ప్రజలు కాంగ్రెస్ కు ఓటుతోనే బుద్ధి చెప్పాలన్నారు.  ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని రేవంత్ రెడ్డి నిలబెట్టుకునేవరకు బీఆర్ఎస్ పక్షాన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వెంటాడుతూనే ఉంటామని కేటీఆర్ స్పష్టం చేశారు. కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలను తాను ఇచ్చినట్టు ఢిల్లీలో రేవంత్ రెడ్డి చెప్పుకోవడం సిగ్గుచేటన్న కేటీఆర్…. ఇచ్చిన మాట నిలబెట్టుకోకుంటే రాబోయే ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం వీపును తెలంగాణ ప్రజలు చింతపండు చేస్తరని కేటీఆర్ చెప్పారు. చేవెళ్లలో త్వరలో ఉప ఎన్నిక వస్తుందన్న కేటీఆర్, పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లోనూ త్వరలో ఎన్నికలు జరుగుతాయన్నారు. షాబాద్ రైతు దీక్ష ఆరంభం మాత్రమే అన్న ఆయన….  ఈ నెల 21న నల్లగొండలో రైతు ధర్నా ఆ తర్వాత అన్ని జిల్లాల్లోనూ రైతు దీక్షలు జరుపుతామన్నారు. ఎన్ని కేసులు పెట్టినా జైలుకు పంపిన రైతుల పక్షాన కొట్లాడుతూనే ఉంటామని తేల్చి చెప్పారు. ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టిన బిఆర్ఎస్ నాయకులు రైతు దీక్షను బ్రహ్మాండంగా జరిపినందుకు స్థానికి బీఆర్ఎస్ నాయకులను కేటీఆర్ అభినందించారు

Leave A Reply

Your email address will not be published.