అమరావతి, ఏప్రిల్ 4:
అమరావతి రాజధాని నిర్మాణ పనులను నిర్దేశిత లక్ష్యాల మేరకు వేగంగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను, నిర్మాణ సంస్థలను ఆదేశించారు. పనుల్లో మరింత వేగం పెరగాల్సి ఉందని, రాజధాని నిర్మాణంలో ప్రతి ఒక్కరూ చరిత్రలో భాగస్వాములు అవుతున్నారని ఆయన అన్నారు.
శనివారం క్యాంప్ కార్యాలయంలో రాజధాని నిర్మాణ పనులు చేపడుతున్న వివిధ కాంట్రాక్ట్ సంస్థల ప్రతినిధులతో సీఎం సమీక్ష నిర్వహించారు. అమరావతిని ఐకానిక్ సిటీగా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని, నిర్మాణ పనులు కేవలం కాంట్రాక్ట్ పనులుగా కాకుండా దేశానికి ఒక ప్రతిష్టాత్మక రాజధాని నిర్మాణంగా భావించి పని చేయాలని ఆయన సూచించారు.
ప్రస్తుతం రాజధానిలో హౌసింగ్, రోడ్లు, ట్రంక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌తో పాటు అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయం వంటి కీలక భవనాల పనులు కొనసాగుతున్నాయని అధికారులు సీఎం కు వివరించారు. మొత్తం రూ.57,821 కోట్ల విలువైన పనుల్లో ఎక్కువ భాగం ఇప్పటికే ప్రారంభమైనట్లు తెలిపారు.
సమీక్షలో సీఎం చంద్రబాబు ప్రతి కాంట్రాక్ట్ సంస్థ పనితీరును వేర్వేరుగా పరిశీలించి లక్ష్యాల సాధనపై ఆరా తీశారు. వారానికి రూ.941 కోట్ల పనులు పూర్తి కావాల్సి ఉందని గుర్తు చేస్తూ, నెలవారీ, వారవారీ లక్ష్యాలతో పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు.
వర్షాకాలం ప్రారంభమయ్యేలోపు పెండింగ్ పనులను పూర్తి చేయాలని సీఎం సూచించారు. నిర్మాణ పనులకు అవసరమైన ఇసుక, గ్రావెల్ సరఫరాలో ఎలాంటి ఆటంకాలు లేకుండా గ్రీన్ ఛానల్ ద్వారా సరఫరా చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ విషయంలో ఎవరైనా అడ్డంకులు సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
నిర్మాణ సంస్థల వద్ద సరిపడా మ్యాన్ పవర్, మెషినరీ వినియోగం పెంచాలని సీఎం సూచించారు. ప్రస్తుతం అవసరమైన స్థాయిలో యంత్రాలు, సిబ్బంది ఉన్నప్పటికీ మరింత పెంపు అవసరమని చెప్పారు. నాణ్యతతో పాటు ఖర్చు తగ్గించే విధంగా ఆధునిక సాంకేతికతను వినియోగించాలని సూచించారు.
ఇటీవల రాజధాని ప్రాంతంలో జరిగిన అగ్ని ప్రమాదాలపై సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. నిర్మాణ సామగ్రి భద్రత కాంట్రాక్టు సంస్థల బాధ్యతేనని స్పష్టం చేస్తూ, నిర్లక్ష్యం కారణంగా ప్రభుత్వానికి చెడ్డపేరు రాకూడదని హెచ్చరించారు.
ప్రతి నిర్మాణ సంస్థ ప్రాజెక్ట్ మేనేజర్లను సమర్థులైనవారితో నియమించుకోవాలని, పనుల్లో ఎలాంటి ఆలస్యం జరిగినా ప్రభుత్వం సహించబోదని ఆయన తేల్చిచెప్పారు.
ఈ సమావేశంలో మంత్రి నారాయణతో పాటు సీఆర్డీఏ, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అమరావతిని ప్రపంచ స్థాయి ఫ్యూచర్ సిటీగా తీర్చిదిద్దే దిశగా పనులు వేగంగా కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు.