- తెలంగాణలో టీడీపీని బలోపేతం చేస్తాం
- ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళి అర్పించిన ఏపీ మంత్రి నారా లోకేష్
ముద్ర, తెలంగాణ బ్యూరో : హైదరాబాద్ నగరంలోని ఎన్టీఆర్ ఘాట్ నిర్వహణపై ఆంధ్రప్రదేశ్ మంత్రి, టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ మేరకు శనివారం ఎన్టీఆర్ 29వ వర్ధంతి సందర్భంగా ఎన్టీర్ ఘాటా్ వద్ద మంత్రి నారా లోకేశ్ నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్టీఆర్ ఘాట్ గోడలు, పైకప్పు పెచ్చులూడిపోయాయని, గార్డెన్ లోని లైట్లు విరిగిపడ్డాయని చెప్పారు. అవసరమైన అనుమతులు తీసుకుని ఎన్టీఆర్ ఘాట్ మరమ్మతులు సొంత ఖర్చులతో పూర్తి చేస్తామన్నారు. ఎన్టీఆర్ ఘాట్ బాద్యతలను చూడాల్సిన హెచ్ ఎండీఏ తీరు పట్ల ఎన్టీఆర్ అభిమానులు అగ్రహం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు.
ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ ఘాట్ నిర్వహణ బాధ్యతలను ఎన్టీఆర్ ట్రస్టుకు అప్పగించాలని పలుమారులు గత తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశామని ఆయన తెలిపారు. తెలంగాణలో టీడీపీ పార్టీ పునర్నిర్మాణంపై చర్చిస్తున్నాం అని, త్వరలోనే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని నారా లోకేశ్ తెలిపారు. తెలంగాణలో 1.60 లక్షల మంది పార్టీ సభ్యత్వం తీసుకున్నారని, టీడీపీపై తెలంగాణ ప్రజలకు ప్రేమ ఉందన్నారు. తెలంగాణలో టీడీపీ పార్టీని బలోపేతం చేయడమే తమ లక్ష్యం అని లోకేశ్ చెప్పారు. ఎన్టీఆర్ కేవలం మూడు అక్షరాలు కాదని, అదొక్క ప్రభంజనమని అన్నారు. సినీ రంగంలో అన్ని రకాల సినిమాలు తీసి తన మార్క్ చూపించారని కొనియాడారు.
రాజకీయాల్లో కూడా ఎన్నో సేవలు అందించారన్నారు. రెండు రూపాయలకే బియ్యం అందించారని, మహిళలకు ఆస్తిలో హక్కు కల్పించిన గొప్ప వ్యక్తి ఎన్టీఆర్ అని గుర్తుచేశారు. తెలుగు వారిని మద్రాసీలు అనేవారని, వాళ్లందరికీ తెలుగు వారమని గర్వంగా చెప్పుకునేలా ఎన్టీఆర్ కృషి చేశారన్నారు. ఎన్టీఆర్ ఏ ఆశయాలతో పార్టీని పెట్టారో అందరికీ తెలుసన్నారు. ఆయన ఆశయాలతో పార్టీని ముందుకు తీసుకెళతామన్నారు ఏదైనా తప్పు జరిగితే.. దానిని సరిదిద్దడానికి కూడా పార్టీలో పెద్దలు ఉన్నారని మంత్రి లోకేష్ చెప్పారు.