- అంగన్వాడిలో పిల్లలకు బోధన పకడ్బందీగా జరగాలి.
- ఏదులాపురం చెరువు కబ్జాకు గురి కాకుండా చూడాలి.
- ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆదేశం.
పాలేరు, ముద్ర విలేకరి: పల్లె దవాఖాన ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆదేశించారు.గురువారం ఆయన ఖమ్మం రూరల్ మండలం ఏదులాపురం గ్రామంలోని పల్లె దవాఖానా, అంగన్వాడీ సెంటర్ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ అనుదీప్, పల్లె దవాఖాన ద్వారా ప్రజలకు, గర్భిణీ స్త్రీలకు అందిస్తున్న వైద్య సేవలు, ఔషధ వివరాలను అడిగి తెలుసుకున్నారు. అక్కడే బీపి చెక్ చేయించుకున్నారు. తనిఖీ సమయంలో ఏ.ఎన్.ఎం. సెలవులో ఉన్నారని ఆశాలు చెప్పడంతో, డి.ఎం.హెచ్.ఓ. కు ఫోన్ చేసి తెలుసుకున్నారు. గర్భిణీ స్త్రీలకు టీకాలను సకాలంలో అందించాలని సూచించారు. దవాఖానాలో ఉన్న మందుల నిల్వలను పరిశీలించారు. అనంతరం కలెక్టర్ ఏదులాపురం అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీ చేశారు. పిల్లల అటెండెన్స్, స్టాఫ్ వివరాలను అడిగి తెలుసుకొని పిల్లలకు అందించే గుడ్లు, బాలామృతం స్టాక్ వివరాలను తెలుసుకొని, కోడి గుడ్ల నాణ్యతను పరిశీలించారు.పిల్లల ఎదుగుదలను ఎప్పటి కప్పుడు మానిటరింగ్ చేయాలని సూచించారు. పాఠ్య పుస్తకాలు, ఏక రూప దుస్తులపై ఆరా తీశారు. అలాగే ఏదులాపురం రెవెన్యూ సదస్సులో పాల్గొన్నారు. భూ సమస్యలపై వచ్చే దరఖాస్తులను భూ భారతి చట్టం నిబంధనల మేరకు పరిష్కరించాలని స్థానిక అధికార్లను ఆదేశించారు. పాస్ బుక్కుల కోసం వచ్చిన దరఖాస్తులను క్షేత్ర స్థాయిలో పరిశీలించి, సర్వేయర్ ద్వారా పకడ్బందీ సర్వే నిర్వహించి సమస్యలను పరిష్కరించాలని సూచించారు.అనంతరం చెరువును పరిశీలించి, ఏదులాపురం చెరువు కబ్జాపై ఫిర్యాదులు వస్తున్నాయని, వెంటనే సర్వే చేసి కబ్జా కాకుండా ఏదులాపురం చెరువు హద్దులు ఏర్పాటు చేయాలన్నారు.చెరువు ప్రక్కన వాక్ వే ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఏదులాపురం మున్సిపల్ కమీషనర్ ను ఆదేశించారు. మిషన్ భగీరథ ఇన్ టేక్ వెల్ కం పంప్ హౌస్ ను పరిశీలించి, 20 సంవత్సరాలకు ఉపయోగ పడేలా చెరువు అభివృద్ధికి ప్రణాళికలు తయారు చేయాలన్నారు. చెరువు పరిసరాల్లో మొక్కలు నాటాలని సూచించారు.అనంతరం ఏదులాపురంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు నిర్మించుకుంటున్న ఇళ్ల నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించారు.ఈ పర్యటనలో కలెక్టర్ వెంట ఏదులాపురం మున్సిపల్ కమీషనర్ ఏ. శ్రీనివాస రెడ్డి, ఖమ్మం రూరల్ మండలం తహసీల్దార్ రాంప్రసాద్ తదితరులు ఉన్నారు.
