ముద్ర ప్రతినిధి, నిర్మల్:
నిర్మల్ ఎం ఎల్ ఎ గా, 10 ఏళ్లు రాష్ట్రమంత్రిగా ఉండి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ఏం వెలగబెట్టారని బీజేపీ సీనియర్ నాయకులు రావుల రాంనాథ్, జిల్లా ప్రధాన కార్యదర్శి విలాస్ ప్రశ్నించారు. ఓటమి నుండి ఇంకా కోలుకోలేక మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి మతి భ్రమించి స్థానిక ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి పై అసత్య ప్రచారాలు చేస్తున్నారని వారు మండిపడ్డారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. రిటైర్మెంట్ లైఫ్ ఎంజాయ్ చేస్తూ వెకేషన్ లో నిర్మల్ కు వస్తూ కేవలం మీడియాలో కనిపించడానికి ఏది పడితే అది మాట్లాడుతున్నారని అన్నారు. పదవుల కోసం, పైసల కోసం పార్టీలు మారే ఇంద్రకరణ్ కు బీజేపీ ని, ఏలేటి మహేశ్వర్ రెడ్డిని విమర్శించే అర్హత లేదన్నారు. ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి నియోజక వర్గ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం నుండి కోట్లాది నిధులు తీసుకువస్తున్నారని తెలిపారు. బీజేపీ శాసనసభా పక్ష నేతగా రాష్ట్ర స్థాయిలో అటు అసెంబ్లీలో గొంతు ఎత్తి పోరాడే ఎమ్మెల్యేపై విమర్శలు చేస్తే సహించేది లేదని మండి పడ్డారు. నిర్మల్ లో మహా ధర్నాకు పిలుపు ఇస్తే రైతులు రోడ్ల మీదికి రాగానే ఉలిక్కి పడి ఇంద్రకరణ్ రెడ్డి మతి భ్రమించి మీడియా ముందుకు వచ్చాడన్నారు. ఏ ఎండకాగొడుగు పట్టే ఇంద్రకరణ్ స్వార్ధం కోసం నిర్మల్ అభివృద్ధిని అటకెక్కించారన్నారు. ఆయన అధికారంలో ఉన్నప్పుడు చేసిన దందాలు ,అరాచకాలు, డి1 పట్టాల కథ ప్రజలందరికి తెలుసన్నారు. ఇకనైనా ఇలాంటి అసత్య ప్రచారాలు మానుకొని నోరు అదుపులో పెట్టుకోవాలని బీజేపీ నేతలు హెచ్చరించారు. ఈ మీడియా సమావేశంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కరిపే
విలాస్, బీజేపీ సీనియర్ నాయకులు జమాల్, బి జె వై ఎం జిల్లా అధ్యక్షులు ఒడిసెల అర్జున్, రాష్ట్ర కార్యదర్శి వెంకటేష్, కౌన్సిలర్ సాత్విక్, ధని గ్రామ సర్పంచ్ బడి పోతన్న తదితరులు పాల్గొన్నారు.