Take a fresh look at your lifestyle.

ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించాలి -కలెక్టర్ ఆదర్శ్ సురభి

 
ముద్ర, వనపర్తి :
జిల్లాలోని అన్ని ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాల్లో నిబంధనలు కచ్చితంగా పాటిస్తూ, పరీక్షలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు.
బుధవారం జిల్లా కలెక్టర్ వనపర్తి పట్టణంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ పరీక్షా కేంద్రంలోని ఏర్పాట్లను పరిశీలించి, ముఖ్య పర్యవేక్షకుడికి (చీఫ్ సూపరింటెండెంట్) పలు సూచనలు చేశారు. విద్యార్థులను పరీక్షా కేంద్రంలోకి అనుమతించే ముందు కచ్చితంగా తనిఖీలు నిర్వహించాలని, ఎలక్ట్రానిక్ పరికరాలు, మొబైల్ ఫోన్లు, గడియారాలు వంటి వస్తువులను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించవద్దని ఆదేశించారు. ఎలాంటి మాల్ ప్రాక్టీస్ చోటుచేసుకోకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
పరీక్షలు ప్రశాంత వాతావరణంలో సజావుగా సాగేందుకు అవసరమైన అన్ని సౌకర్యాలను విద్యార్థులకు కల్పించాలని అధికారులకు సూచించారు. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని పరీక్షా కేంద్రంలో ఒఆర్‌ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.
అనంతరం కలెక్టర్ హాజరు వివరాలను అడిగి తెలుసుకున్నారు. చీఫ్ సూపరింటెండెంట్ వివరాల ప్రకారం తొలిరోజున తమ పరీక్ష కేంద్రం లో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షకు మొత్తం 385 మంది విద్యార్థులకు గాను 370 మంది హాజరయ్యారని, 15 మంది గైర్హాజరైనట్లు తెలిపారు. జిల్లాలోని అన్ని పరీక్షా కేంద్రాల్లో నిబంధనలు కచ్చితంగా పాటిస్తూ పారదర్శకంగా పరీక్షలు నిర్వహించాలని కలెక్టర్ సంబంధిత అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్‌డీఓ సుబ్రహ్మణ్యం, జిల్లా ఇంటర్ విద్యా అధికారి అంజయ్య పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.