- రంగంలో రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జీ మీనాక్షి నటరాజన్.
- అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా సమీక్షలు పూర్తి.
- తాజాగా కార్పొరేషన్ ఛైర్మన్లతో భేటీ.
- ప్రభుత్వ పథకాల అమలు, పార్టీ బలోపేతం, కమ్యూనికేషన్ వ్యూహాలపై చర్చ.
- ఇకపై గాంధీభవన్ లో రోజుకు ఇద్దరు ఛైర్మన్లు.
- సోషల్ మీడియా, విపక్షాల విమర్శలకు కౌంటర్.
- నియోజకవర్గాల వారీగా ప్రోటోకాల్ పై మంతనాలు.
ముద్ర, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో సంస్థాగతంగా బలోపేతంపై హస్తం ఫోకస్ చేసింది.రాష్ట్ర, జిల్లా, నియోజకం, మండల స్థాయిలో సమర్థ నాయకత్వాన్ని పునరుద్ధరణ చేసేందుకు టీపీసీసీ కసరత్తు చేస్తోంది.ఈ కీలక బాధ్యతలను తన భుజస్కందాలపై వేసుకున్న పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జీ మీనాక్షి నటరాజన్ రాష్ట్రంలోని 119 అసెంబ్లీ సెగ్మెంట్ల ఎమ్మెల్యేలు, పోటీ చేసిన నాయకుల నుంచి అభిప్రాయాలు తెలుసుకున్నారు. క్షేత్రస్థాయిలో తాజా రాజకీయ పరిస్థితులతో పాటు పార్టీ బలాబలాలు, ఇతర పార్టీల స్థితిగతులు తెలియడంతో మొత్తం మీద రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులతో పాటు మంత్రుల పనితీరు, ప్రభుత్వ పథకాల అమలు, నియోజకవర్గ, మండల స్థాయిలో పార్టీ బలోపేతం కావాలంటే ఏం చేయాలి, కార్పోరేషన్ పదవుల కోసం పార్టీ నాయకుల ఎదురు చూపులు తదితర అంశాలపై పార్టీ రాష్ట వ్యవహారాల ఇన్ ఛార్జీ మీనాక్షి నటరాజన్.. పార్టీ అధిష్టానానికి త్వరలోనే ఓ నివేదిక ఇవ్వనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.ఈ నివేదిక ఆధారంగా ప్రభుత్వం ఏవిధంగా ముందుకు వెళ్లాలి..? పార్టీపరంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలి ?ప్రతిపక్ష పార్టీలను ఎలా ఎదుర్కొవాలి? సామాజిక మాద్యమాల ద్వారా ప్రభుత్వంపై జరుగుతున్న దుష్ప్రచారం తదితర అంశాలపై ఏఐసీసీ స్థాయిలో ఓ నిర్ణయానికి వచ్చి నిర్దిష్టమైన సలహాలు సూచనలు రాష్ట్ర నాయకత్వానికి, ప్రభుత్వానికి ఇచ్చే అవకాశం ఉందని పీసీసీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు రాష్టంలో కాంగ్రెస్ అధికారంలో వచ్చి దాదాపు ఏడాదిన్నర కాగా సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కార్ అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తోందని రాష్ట్ర నేతలు మీనాక్షి నటరాజన్ కు వివరించారు. ఎన్నికల హామీలు అమలు చేస్తూనే ఇతర అభివృద్ధి కార్యక్రమాలను చేసుకుంటూ పోతోందని వివరించారు. కానీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీల ఉచిత పథకాలతో పాటు, పలు పథకాలకు రాయితీలు పెద్ద ఎత్తున ఇస్తున్నా, ఉద్యోగాలు భర్తీ చేస్తున్నా, నిరుద్యోగ యువతకు చేయూతనిచ్చేందుకు రాజీవ్ వికాస్ పథకం అందుబాటులోకి తీసుకొచ్చినా, సన్న బియ్యం ఇస్తుదన్నా, కులగణన పూర్తి చేసినా, 42శాతం బీసీ రిజర్వేషన్‌కు బిల్లు తీసుకొచ్చినా, స్కిల్ యూనివర్శిటీ ఏర్పాటు చేసి వృత్తిలో నైపుణ్యత పెంచుతున్నా, ఆశించిన స్థాయిలో ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి వెళ్లడం లేదని పార్టీ రాష్ట్ర ఇన్ ఛార్జీ ప్రత్యేకంగా నిర్వహించిన సర్వేలో తేలింది. దీంతో ముందుగా ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాలను ప్రజలకు వివరించాలని భావిస్తోన్న మీనాక్షి ఆ అంశంపై ప్రధాన దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా మంగళవారం వివిధ కార్పొరేషన్ ఛైర్మన్ల తో ఆమె సన్నాహాక సమావేశం నిర్వహించారు. ఇందులో ప్రభుత్వ పథకాల అమలు, పార్టీ బలోపేతం, కమ్యూనికేషన్ వ్యూహాలపై కీలక చర్చ జరిపారు. ఈ నేపథ్యంలో గాంధీ భవన్‌లో నిర్వహించే మీడియా సమావేశాల్లో రోజూ ఇద్దరు కార్పొరేషన్ ఛైర్మన్లకు మాట్లాడే అవకాశం కల్పించాలని తీర్మానించారు. అలాగే సోషల్ మీడియాలో చురుకుగా ఉండాలని, ప్రతిపక్ష విమర్శలకు సమర్ధంగా స్పందించాలని మీనాక్షి పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా ఛైర్మన్లు మీనాక్షి నటరాజన్ కృతజ్ఞతలు తెలిపారు.ఆమె ఇచ్చిన మార్గదర్శకాన్ని అనుసరించి, పార్టీ నైతిక విలువలు, ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు తాము కట్టుబడినట్లు ప్రకటించారు.అదే సమయంలో చైర్మన్లకు నియోజకవర్గాల వారీగా ప్రోటోకాల్‌ను అమలు చేయాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు.