వికలాంగుల చట్టాలు, సంక్షేమ పథకాల అమలు కోసం ఉద్యమం : ఎన్.పి.ఆర్.డి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యం. అడివయ్య
ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి :
వికలాంగుల చట్టాలు, సంక్షేమ పథకాల అమలు కోసం ఉద్యమం చేయాలని ఎన్.పి.ఆర్.డి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యం. అడివయ్య పిలుపునిచ్చారు. శుక్రవారం వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (ఎన్.పి.ఆర్.డి) యాదాద్రి భువనగిరి జిల్లా విస్తృత సమావేశం జిల్లా అధ్యక్షులు సూరపంగా ప్రకాష్ అధ్యక్షతన దుంపల మల్లారెడ్డి స్మరక భవన్లో జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన అడివయ్య మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 28 నెలలు అవుతుందని, అసెంబ్లీ ఎన్నికలల్లో వికలాంగులకు ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదన్నారు. పెన్షన్స్ పెంచకుండా ప్రభుత్వం ఎందుకు కాలయాపన చేస్తుందని అన్నారు. 2026-27 బడ్జెట్లో వికలాంగుల సంక్షేమనికి అవసరమైన నిధులు కేటాయించలేదని అన్నారు. బాలాభరోసా పథకాన్ని ప్రకటించిన ప్రభుత్వం నిధులు ఎందుకు కేటాయించలేదని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత 1.69 లక్షల మంది పెన్షన్స్ రద్దు చేశారాని అన్నారు. నేటికీ రాష్ట్రంలో 95 శాతం ప్రభుత్వ కార్యాలయాలు వికలాంగులు వినియోగించుకునేందుకు అనుకూలంగా లేవని అన్నారు. కేంద్ర ప్రభుత్వం వికలాంగుల చట్టాలను అమలు చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని అన్నారు. రాష్ట్ర అధ్యక్షులు కె వెంకట్ మాట్లాడుతూ వికలాంగులకు విద్యా, ఉపాధి అవకాశాలు కల్పించడం లేదని అన్నారు. వికలాంగులపై జరుగుతున్న వేధింపులను అరికట్టెందుకు ప్రత్యేక రక్షణ చట్టం చేయాలని డిమాండ్ చేశారు. అంగవైకల్యం పట్ల శాస్త్రీయ అవగాహనా కల్పించాలని డిమాండ్ చేశారు. జనగానణలో వికలాంగుల వివరాలు ప్రత్యేకంగా సేకరించాలని డిమాండ్ చేశారు.
మే 29-31 తేదీల్లో యాదగిరిగుట్టలో ఎన్ పి ఆర్ డి రాష్ట్ర ప్లినం నిర్వహిస్తున్నామని తెలిపారు. 33 జిల్లాల నుండి 500 మంది ప్రతినిధులు హాజరు అవుతున్నారని అన్నారు ఈ సమావేశంలో రాష్ట్ర కోశాధికారి ఆర్ వెంకటేష్, రాష్ట్ర ఉపాధ్యక్షులు బి స్వామి, జిల్లా అధ్యక్షులు సూరపంగా ప్రకాష్, కార్యదర్శి వి ఉపేందర్, రాష్ట్ర కమిటీ సభ్యురాలు కె లలిత, జిల్లా ఉపాధ్యక్షులు శ్యామ్ సుందర్,ఆంజనేయులు, బర్ల పార్వతి, సహాయ కార్యదర్శులు శంకర్, శ్రీహరి,జిల్లా నాయకులు రజిత, పద్మ,లింగ్య నాయక్ దాసు, పాల్గొన్నారు.