- వివిధ పార్టీలు, ప్రజా సంఘాల నేతల విజ్ఞప్తి.
- ఖమ్మం నగరంలో భారీ శాంతి ప్రదర్శన.
ముద్ర ప్రతినిధి, ఉమ్మడి ఖమ్మం: దండకారణ్యంలో ఆపరేషన్ కగార్ ను, ఆదివాసీయులపై జరుగుతున్న మరణ హోమాన్ని, దాడిని వెంటనే నిలిపి వేసి మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వివిధ పార్టీల నేతలు, ప్రజా సంఘాల ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు.శనివారం కేంద్రం కాల్పుల విరమణ పాటించి మావోయిస్టులతో శాతి చర్చలు జరపాలని కోరుతూ వివిధ రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఖమ్మం ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ నుండి పాత బస్టాండ్ వరకు శాంతి ప్రదర్శన జరిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత నాలుగు రోజులుగా కర్రి గుట్టలో మావోయిస్టులు ఉన్నారనే సమాచారంతో కేంద్ర పారా మిలిటరీ, వివిధ రాష్ట్రాల బలగాల ఆధ్వర్యంలో కొనసాగిస్తున్న ఆపరేషన్ను ఆపి వేసి, బలగాలను వెనక్కి పంపాలని ప్రభుత్వాన్ని కోరారు.తన దేశ పౌరుల పైన యుద్ధం చేయడం ప్రపంచంలో ఎక్కడా లేదన్నారు.దేశ సరి హద్దుల్లో ఉండాల్సిన సైనికులు దండ కారణ్యంలో ఆదివాసులపై యుద్ధం చేయడం అప్రజాస్వామీకమన్నారు.మరొక ప్రక్క ప్రభుత్వంతో శాంతి చర్చలు జరపడానికి మేము సిద్ధంగా ఉన్నామని ఇప్పటికే మావోయిస్టులు ప్రకటించినప్పటికీ, ప్రభుత్వ వైపు నుంచి సానుకూలమైన స్పందన రాక పోవడం వెనుక కార్పొరేట్ శక్తులు, బహుళ జాతి కంపెనీలు ఉన్నాయని ఆరోపించారు.ఈ దేశ సంపదను కాపాడు కోవడం కోసం ఆదివాసీయులకు మద్దతుగా ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కోరారు.ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి నున్న నాగేశ్వరరావు, డివిజన్ కార్యదర్శి విక్రమ్, ఎర్ర శ్రీనివాస్, సిపిఐ జిల్లా నాయకులు సింగు నరసింహా రావు, పోటు కళావతి, శివరామకృష్ణ, సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఆవునూరి మధు, జి ల్లా నాయకులు లక్ష్మీనారాయణ తెలంగాణ జన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోపగాని శంకర్రావు, సర్దార్,ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా కార్యదర్శి స్వర్ణ సుబ్బారావు, బీఎస్పీ జిల్లా కార్యదర్శి నాగరాజు, తెలంగాణ పీపుల్ జేఏసీ జిల్లా కన్వీనర్ దేవిరెడ్డి విజయ్, జర్నలిస్ట్ యూనియన్ జిల్లా కార్యదర్శి చిర్ర రవి, జిల్లా నాయకులు కే.వెంకటేశ్వర్లు, ప్రముఖ విద్యావేత్త రవి మారుత్, టిపిటిఎఫ్ పూర్వ రాష్ట్ర నాయకులు బాబురావు, తాళ్లూరు వేణు, రాష్ట్ర నాయకులు విజయ్, సామాజిక ఉద్యమకారులు అరవపల్లి విద్యాసాగర్, గుంతెటి వీరభద్రం, పేల్లూరి విజయ్ కుమార్, మాల మహానాడు జిల్లా అధ్యక్షులు దాసరి శ్రీను, బీసీ సంఘం నాయకులు పెరుగు వెంకటరమణ, విద్యావంతుల వేదిక జిల్లా నాయకులు అజిత్ పాషా తదితరులు పాల్గొన్నారు.