ముద్ర కూకట్‌పల్లి :
నగరంలో మరోసారి మాదకద్రవ్యాల ముఠా గుట్టురట్టయింది. జెఎన్‌టియు మెట్రో స్టేషన్ సమీపంలోని రత్నదీప్ సూపర్ మార్కెట్ వద్ద డ్రగ్స్ విక్రయిస్తున్న నలుగురు యువకులను కేపీహెచ్‌బీ పోలీసులు సోమవారం తెల్లవారుజామున రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
పోలీసుల కథనం ప్రకారం.. మార్చి 29 రాత్రి కొందరు వ్యక్తులు డ్రగ్స్ విక్రయించేందుకు వస్తున్నట్లు ఎస్ఐకి ముందస్తు సమాచారం అందింది. దీంతో పోలీసులు, క్లూస్ టీం మరియు పంచ సాక్షులతో కలిసి రత్నదీప్ సూపర్ మార్కెట్ వద్ద నిఘా పెట్టారు. సోమవారం తెల్లవారుజామున (మార్చి 30) సుమారు 00:30 గంటల సమయంలో స్కూటీపై వచ్చిన ఇద్దరు వ్యక్తులు, అక్కడ వేచి ఉన్న మరో ఇద్దరికి అనుమానాస్పదంగా ప్యాకెట్లు అందిస్తుండగా పోలీసులు వారిని చుట్టుముట్టారు.అరెస్టయిన వారిలో విశాఖపట్నానికి చెందిన ఐటీ ఉద్యోగి బెండి సాయి భాను ప్రకాష్ (27), విజయనగరానికి చెందిన ప్రైవేట్ ఉద్యోగి సరిపల్లి అనూప్ కుమార్ అలియాస్ పండు (27), ఢిల్లీకి చెందిన డీజే ప్లేయర్ శోభిత్ అలెన్మణి (25), మరియు జోధ్‌పూర్ (రాజస్థాన్)కు చెందిన ఆర్కిటెక్ట్ రిపుంజయ్ జోధా (29) ఉన్నారు.నిందితుల వద్ద ఉన్న స్కూటీ డిక్కీని తనిఖీ చేయగా భారీగా మాదకద్రవ్యాలు లభ్యమయ్యాయి. వీటిని క్లూస్ టీం సమక్షంలో తూకం వేయగా:
150 గ్రాముల గంజాయి (MO-1)
04 గ్రాముల ఎండీఎంఏ (MDMA) క్రిస్టల్స్ (MO-2)
09 ఎల్‌ఎస్‌డీ (LSD) బ్లాట్ పేపర్లు (MO-3)
వీటితో పాటు 5 మొబైల్ ఫోన్లు, డ్రగ్స్ తరలిస్తున్న స్కూటీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
బెంగుళూరు టూ హైదరాబాద్.. ఈజీ మనీ కోసం:
విచారణలో నిందితుడు భాను ప్రకాష్ విస్తుపోయే నిజాలు వెల్లడించాడు. బెంగుళూరులో తన స్నేహితుడైన అభిషేక్ ద్వారా తక్కువ ధరకు డ్రగ్స్ కొనుగోలు చేసి, కొరియర్ ద్వారా హైదరాబాద్ తెప్పించేవారని తెలిపాడు. ఇక్కడ గంజాయి 5 గ్రాములు ₹500 కి, ఎండీఎంఏ గ్రాము ₹4,500 కి, మరియు ఒక్కో ఎల్‌ఎస్‌డీ పేపర్‌ను ₹2,500 కి విక్రయిస్తూ భారీగా లాభాలు గడిస్తున్నట్లు ఒప్పుకున్నాడు.
పోలీసులు కేసు నమోదు చేసి, ఈ ముఠా వెనుక ఉన్న ప్రధాన నిందితుడు అభిషేక్ మరియు ఇతర వ్యక్తుల కోసం గాలిస్తున్నారు. నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు