Take a fresh look at your lifestyle.

మత్తు మాటున ప్రాణాంతక ఇంజెక్షన్లు

  • నలుగురి అరెస్ట్.
  • ఎస్పీ జానకి షర్మిల.

ముద్ర ప్రతినిధి, నిర్మల్: మత్తు పదార్థాలకు, డ్రగ్స్ కు బానిసైన వారికి ప్రాణాంతక మత్తు ఇంజెక్షన్లు ఇస్తూ డబ్బు సంపాదిస్తున్న నలుగురిని అరెస్టు చేశామని నిర్మల్ ఎస్పి జానకి షర్మిల తెలిపారు.గురువారం తమ కార్యాలయంలో అడిషనల్ ఎస్పీ రాజేష్ మీనా తో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు.షేఖ్ ఫర్ధిన్, పర్వేజ్, చౌహాన్ గోవింద, మహమ్మద్ అబ్దుల్ డానీష్ ఈజీ మనీ కోసం కొత్త పద్ధతికి శ్రీకారం చుట్టారన్నారు. మిడాజోలం అనే మత్తు ఇంజక్షన్ ను యువకులకు ఇస్తూ వారిని మత్తుకు బానిసలుగా చేసి ఎక్కువ డబ్బు వసూలు చేసేందుకు గ్రూపుగా ఏర్పడ్డారని తెలిపారు.ఆసుపత్రుల్లో రోగులకు అనెస్తీషియా కు ఇచ్చే ఇంజక్షన్ ను ఇందుకు ఎంచుకున్నారన్నారు. నిందితుల్లో ఒకరు షేక్ ఫర్ధిన్ ల్యాబ్ టెక్నిషియన్ గా మూడేళ్లుగా పనిచేస్తున్నాడన్నారు.తనకున్న పరిజ్ఞానంతో స్నేహితులైన పర్వేజ్, చౌహాన్ గోవింద, మరియు మహమ్మద్ అబ్దుల్ డానీష్ లతో కలిసి ఈ కార్యక్రమాన్ని చేపట్టారన్నారు. మత్తు పదార్థాలకు అలవాటుపడ్డ వారి వివరాలను వీరు సేకరించారన్నారు.షేఖ్ ఫర్ధిన్, చౌహాన్ గోవింద, మహమ్మద్ అబ్దుల్ డానీష్ లు పట్టణంలోని వివిధ ఆసుపత్రుల నుంచి ఇంజక్షన్లను, సిరంజీలను సేకరించారన్నారు. కాగా మహమ్మద్ ఫర్వేజ్ మత్తుకు బానిసైన వారిని దగ్గరికి వెళ్ళి వారికి స్థానిక మార్కెట్ కమిటీ పరిసరాల్లో ఇంజెక్షన్ చేసేవారన్నారు.ఒక్కో ఇంజెక్షన్ కు రూ.500 చొప్పున తీసుకునేవారని, ఈ వ్యవహారం దాదాపు ఏడాది కాలంగా సాగుతోందని తెలిపారు. తగిన సమాచారంతో వారిని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. వారి వద్ద నుండి 26 ఇంజక్షన్లను, 10 సిరంజీ లను, 4 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని రిమాండ్ కు పంపినట్లు వివరించారు.వీరిలో ఒకరు ఎక్స్ రే టెక్నిషియన్, ఇద్దరు ల్యాబ్ టెక్నీషియన్లు కాగా మరొకరు విద్యార్థి అని పేర్కొన్నారు.ఈ కేసులో చాకచక్యంగా వ్యవహరించిన నిర్మల్ ఎ ఎస్ పి రాజేష్ మీనా, పట్టణ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్, ఎస్ఐ నరేష్, కానిస్టేబుల్ సాయి, నవీన్ లను జిల్లా ఎస్పీ జానకి షర్మిల అభినందించారు. ఈ క్రమంలో మెడికల్ షాపుల్లో ప్రిస్క్రిప్షన్ లేకుండా ఇలాంటి వాటిని విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.

Leave A Reply

Your email address will not be published.