ఆదరించి బిస్కెట్లు పెట్టారని 130km తోడుగా…
కాళ్ల నొప్పులకు సాక్సులతో సాయం..
శునకం భక్తికి నెటిజన్లు ఫిదా..
ముద్ర ప్రతినిధి, జగిత్యాల: విశ్వాసంలో శునకానికి మించినది ఏది లేదు. అలాంటిది విషయాన్ని నిజం చేస్తూ కేవలం రూ.5 బిస్కెట్ లు పెట్టి ఆదరించినందుకు 130 కిలో మీటర్ల మేర భక్తులకు తోడుగా నడిచిన ఓ శునకం విశ్వాసంతో కూడిన భక్తిని చూసిన వారంతా ఫిదా అయ్యారు. ఈ శునకం భక్తి ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.
130 km తోడుగా పాదయాత్ర…
ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూరుకు చెందిన కొందరు భక్తులు హనుమాన్ దీక్ష తీసుకున్నారు. మండల దీక్ష పూర్తికావడంతో, మొక్కు తీర్చుకోవడానికి కాలినడకన కొండగట్టు ఆలయానికి పాదయాత్రన బయలుదేరారు. ప్రయాణం మొదలైన కొద్దిసేపటికే వారికి దారిలో ఓ శునకం ఎదురైంది. ఆకలితో ఉన్న ఆ మూగజీవికి భక్తులు ఓ రూ.5 బిస్కెట్ ప్యాకెట్‌లను వేశారు. దీంతో అప్పటినుంచి శునకం తన విశ్వాసాన్ని చూపించింది. అప్పటి నుంచి ఆ భక్తులు ఎక్కడికి వెళ్తే అక్కడికి, వారు ఎక్కడ ఆగితే అక్కడ ఆ శునకం కూడా వారి వెంటే పాదయాత్రగా నడుస్తూ వస్తుంది. ఎండనక, వాననక ఐదు రోజులగా గుడిహత్నూరు నుంచి కొండగట్టు వరకు సుమారు 130 కి.మీ మేర ఆ భక్తులతో కలిసి నడిచింది. మార్గమధ్యంలో ఎన్ని కుక్కలు ఎదురైనా, ఎన్ని అడ్డంకులు వచ్చినా వారి తోడును మాత్రం వదల్లేదు.
నడకతో కాళ్ల వాపులు…
సుమారు 130 కిలో మీటర్ల నడక వల్ల ఆ కుక్క కాళ్లు వాచిపోయి, నడవలేని స్థితికి చేరుకుంది. అది గమనించిన భక్తులు ఆ మూగజీవి పడుతున్న శ్రమను చూసి చలించిపోయి వారు, దానికి సాక్సులు తొడిగి, కాళ్లకు మందులు రాసి సపర్యలు చేశారు. తమతో పాటే దానికి కూడా ఆహారం పెడుతూ, ఒక కుటుంబ సభ్యుడిలా చూసుకున్నారు. ప్రస్తుతం ఆ శునకానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి.