- దాడికి ప్రతిదాడి వంద రెట్టు తప్పదు.
- ఉగ్రవాదం పట్ల నివాళులర్పించే విధానానికి స్వస్తి.
- అలా చేస్తే ఇంట్లోకి చొరబడి కొడతాం.
- ప్రతి ఒక్కరూ ప్రధాని చెప్పిన విషయాలు ఆచరించాలని పిలుపు.
- ఐక్యతతో కూడిన ఆరోగ్యవంతమైన సమాజ రూపకల్పన అత్యవసరం.
- తిరంగా యాత్రలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలి.
- పాకిస్తాన్ వంకర తోకను కత్తిరించేస్తాం.
- మోడీ మన్ కీ బాత్ వీక్షణలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.
ముద్ర, తెలంగాణ బ్యూరో : ఉగ్రదాడులపై దేశ ప్రజలు ప్రాణాలు కోల్పోతే గులాబీ పూలతో, క్యాండిల్స్ వెలిగించి నివాళులర్పించే విధానానికి ప్రధాని మోడీ సర్కార్ స్వస్తి పలికిందని, అలా చేస్తే ఇంట్లోకి చొరబడి కొడతామని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు, దాడి చేస్తే ప్రతి దాడి తప్పదని ఒక్కరిని చంపితే వందమందిని చంపుతామనే విధానాన్ని పాకిస్థానీ ఉగ్రవాదులకు కళ్లకు కట్టినట్లు చూపించామని ఆయన తెలిపారు.ప్రధాని నరేంద్ర మోడీ మన్ కీబాత్ 122వ ఎపిసోడ్‌ను ఆదివారం సనత్ నగర్ నియోజకవర్గంలో ప్రజలు, బీజేపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆయన వీక్షించారు. ప్రతీ ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని వీక్షించాలని పిలుపునిచ్చారు.ఇందులో ప్రధాని మాట్లాడిన ముఖ్యమైన స్వచ్ఛత, యోగా, డయాబెటీస్ లాంటి విషయాలను ఆచరణలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ ‘మన్ కీ బాత్’ ప్రజలను జాగృతం చేస్తుందని ఐక్యంగా నిలబెడుతుందని, ఆరోగ్యవంతమైన సమాజాన్ని రూపొందిస్తుందని చెప్పారు.ఇందులోని ప్రధాని చేసిన సూచనలు, సలహాలు ప్రతీ ఒక్కరూ తప్పకుండా ఆచరించాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కోరారు.లుంబినీపార్క్, గోకుల్ చాట్, సాయిబాబా టెంపుల్, దిల్ సుక్ నగర్ పేలుళ్లు, ముంబాయి ట్రైన్ దాడులు, పార్లమెంట్ పై దాడి ఇలా అనేక దాడులతో గత 46 ఏళ్లుగా పాక్ ఉగ్రవాదాన్ని భారత్ పై ఎగదోస్తూ అనేకమంది ప్రాణాలను బలితీసుకుందని కిషన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దాడుల సమయంలో నివాళులర్పించి సరిపెట్టుకునేవారమని అన్నారు. కానీ మోదీ ప్రభుత్వం వచ్చాక పఠాన్ కోట్–సర్జికల్ స్ట్రయిక్, పూల్వామా–ఎయిర్ స్ట్రయిక్ యిక్, పహెల్గామ్–ఆపరేషన్ సిందూర్ ద్వారా ఉగ్రవాదాన్ని, ఉగ్రవాదాన్ని పెంచి పోషించే దేశాన్ని కూడా మట్టి కలిపేస్తామనే గట్టి సందేశాన్ని ప్రధాని మోదీ ఇచ్చారన్నారు. ఇలాంటి సమయాల్లోనే పార్టీలు, కులాలు, మతాలు, వర్గాలు, వర్ణాలు అనేవి పక్కన పెట్టి దేశమంతా ఐక్యతగా నిలవాల్సిన అవసరముందుని కిషన్ రెడ్డి చెప్పారు. ఆపరేషన్ సిందూర్ తో 9 ఉగ్రస్థావరాలను పాక్ భూభాగంలోకి చొరబడి మరీ ప్రతీకారం తీర్చుకున్నామన్నారు. ఇందులో భారత సైనికుల పాత్ర కీలకమన్నారు. ఈ ఆపరేషన్ లో విశాఖకు చెందిన ఒక సైనికుడు కూడా ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు. ఇటువంటి సమయంలో నిర్వహిస్తున్న తిరంగ యాత్రలు, ర్యాలీల్లో ప్రతీ ఒక్కరూ పాల్గొని దేశ ఐక్యతను చాటాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.తాను కూడా అంబర్ పేట్, జూబ్లీహిల్స్, నాంపల్లి, ముషీరాబాద్ లలో ర్యాలీలు నిర్వహించానని కిషన్ రెడ్డి చెప్పారు. పహెల్గామ్ దాడి అతిక్రూరమైనదని అన్నారు.పిల్లల ముందు తండ్రిని, భార్యముందు భర్తను చంపడమే గాకుండా హిందువులను పక్కన తీసుకొని మరీ చంపారని కిషన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.మోడీకి చెప్పుకోండని హెచ్చరికలు కూడా జారీ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీరి ఆగడాలకు భారత్ ఆపరేషన్ సిందూర్ ద్వారా గట్టి సమాధానం ఇచ్చిందన్నారు. ఇకపై భారత్ లో జరిగే ప్రతీ దాడికి సమాధానం ఇచ్చి తీరుతామన్నారు.ఉగ్రదాడులపై పాక్ ‘కుక్క తోక వంకర’ అన్నట్లే ప్రవర్తిస్తే ఆ తోకనే కత్తిరించేస్తామని కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి హెచ్చరించారు.
