ముద్ర, వనపర్తి :
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) శతాబ్ది ఉత్సవాల సందర్భంగా సమాజ జాగృతికి చేపడుతున్న వివిధ కార్యక్రమాలను పరిచయం చేయడానికి ఆదివారం వనపర్తి పట్టణంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్‌లో జోగుళాంబ-వనపర్తి జిల్లాల ప్రతిష్ఠిత వ్యక్తుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి వివిధ రంగాలకు చెందిన వ్యాపారులు, వైద్యులు, న్యాయవాదులు, ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగులు, రాజకీయ నాయకులు హాజరయ్యారు. ప్రాంత బౌద్ధిక్ ప్రముఖ్ కూర జయదేవ్, విభాగ్ సంఘచాలక్ యేమిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ముఖ్య వక్తలుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజంలో సానుకూల పరివర్తన తీసుకురావాలంటే ఐదు అంశాలను ఆచరించాలని సూచించారు.

సామాజిక సమరసత
సమాజంలోని అందరూ ఒకటేనన్న భావనతో కుల, మత, వర్గ భేదాలు లేకుండా పరస్పరం గౌరవించుకుంటూ జీవించాలని పేర్కొన్నారు. శ్రీరాముడు వనవాస సమయంలో గుహుడు, శబరితో చూపిన సమానత్వ భావనను ఆదర్శంగా తీసుకోవాలని తెలిపారు.
కుటుంబ ప్రబోధన్
పిల్లలకు భౌతిక సౌకర్యాలతో పాటు జీవన విలువలను కూడా కుటుంబం, పాఠశాలల ద్వారా బోధించాల్సిన అవసరం ఉందన్నారు.
పర్యావరణ పరిరక్షణ
ప్రకృతి పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, మొక్కలు నాటి వాటిని సంరక్షించాలన్నారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం ద్వారా పర్యావరణాన్ని కాపాడవచ్చని సూచించారు.
భాషా–వేషధారణ పరిరక్షణ
మాతృభాష, మాతృదేశం పట్ల గౌరవ భావం కలిగి స్వీయ సంస్కృతిని కాపాడుకోవాలని అన్నారు.
పౌర నియమాలు
ప్రతి పౌరుడు తన బాధ్యతలను నిబద్ధతతో నిర్వర్తించాలి. ప్రభుత్వ నియమ నిబంధనలను గౌరవిస్తూ నడుచుకోవాలని పిలుపునిచ్చారు. ‘పంచ పరివర్తన’ ద్వారా గుడి, బడి, అమ్మఒడిని సంరక్షించడం ద్వారానే సమాజ రక్షణ సాధ్యమని వక్తలు తెలిపారు. సమాజ రక్షణలో ప్రజలను జాగృతం చేయడం సంఘం విధి అని, ఘర్షణలను ఎప్పుడూ ప్రోత్సహించదని స్పష్టం చేశారు. సంఘాన్ని బయట నుంచి చూసి అభిప్రాయం ఏర్పరచుకోకుండా, లోపలికి వచ్చి కార్యక్రమాలను పరిశీలించాలని ఆహ్వానించారు. శాఖల్లో పాల్గొని వ్యక్తి నిర్మాణం ద్వారా సమాజ నిర్మాణం బలపడుతుందని వివరించారు. అనంతరం హాజరైన ప్రతిష్ఠిత వ్యక్తులు సందేహాలకు సమాధానాలు ఇచ్చారు.ఈ సమావేశానికి వివిధ వ్యాపారస్తులు లాయర్లు డాక్టర్లు ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగస్తులు రాజకీయ నాయకులు స్వయం సేవకులు తదితరులు పాల్గొన్నారు.