- రాచకొండ సీపీ కి మార్కెట్ పాలకవర్గం వినతి
ముద్ర, ఇబ్రహీంపట్నం: మామిడి సీజన్ దృష్ట్యా బాటసింగారం పండ్ల మార్కెట్ లో పోలీస్ ఔట్ పోస్ట్ ఏర్పాటు చేయాలని గడ్డన్నారం మార్కెట్ కమిటీ పాలకవర్గం రాచకొండ సీపీ సుధీర్ బాబు కి మంగళవారం వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ పండ్ల మార్కెట్ కి వచ్చే దిగుమతులను తగ్గించే విధంగా కొంతమంది బ్రోకర్లతో కుమ్మక్కై బయట ప్రాంతాలలో వ్యాపారం చేస్తూ విక్రయాలు జరుపుతున్నారని, దీంతో మార్కెట్ ఆదాయానికి గండి పడుతున్నట్లు తెలిపారు.ఇలాంటి వారిపై నిఘా ఉంచి ఎస్ఓటీ,విజిలెన్స్ తనిఖీలు చేసి చర్యలు తీసుకోవాలని కోరారు.బాటసింగారం పండ్ల మార్కెట్ లో ఈ సంవత్సరం మామిడి పండ్ల విక్రయాలు అధికంగా జరిగే అవకాశం ఉన్నందున మార్కెట్ ప్రాంతంలో పోలీస్ ఔట్ పోస్ట్ ఏర్పాటు చేయాలని కోరారు. తాత్కాలిక మార్కెట్ లో జనాభా దృష్ట్యా దొంగతనాలు, దోపిడీలు ఎక్కువగా జరుగుతున్నాయని,ఔట్ పోస్ట్ ఏర్పాటుతో వ్యాపారులు, విక్రయందారుల భద్రత పెరుగుతుందని చెప్పారు.పాలకవర్గం విజ్ఞప్తి మేరకు సీపీ సుధీర్ బాబు ఔట్ పోస్టు ఏర్పాటు ఈ అంశాన్ని పరిశీలించాలని కింది స్థాయి సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బాస్కర్ చారి,సభ్యులు పన్యాల జైపాల్ రెడ్డి, మెగావత్ గణేష్ నాయక్, చెన్ రెడ్డి రఘుపతిరెడ్డి, దోమలపల్లి అంజయ్య, జిన్నం వెంకటేశ్వర్లు గుప్తా తదితరులు పాల్గొన్నారు.