రివైజ్డ్..
ఫోన్ ట్యాపింగ్ విచారణ తుది అంకానికి చేరుకుంది
కేసీఆర్‌పై మాకు కక్ష సాధింపు లేదు
ఆయన దోషి అని తేలితే జైలుకు వెళ్తారు
మరో పదేళ్లు నేనే సీఎంగా ఉంటా
మా ప్రభుత్వంలో ఎవరి ఫోన్లు ట్యాప్ చేయడం లేదు
కాళేశ్వరం, ఫార్ములా ఈ-రేసుపై కేంద్ర ప్రభుత్వం చర్యలవీ..?
సోనియా, రాహుల్ ను విచారించిన ఈడీ, కేటీఆర్‌ను ఎందుకు విచారిస్త లేదు
తెలంగాణకు ‘నేనే రాజు.. నేనే మంత్రి’
రాష్ట్రంలో నాకు పోటీ ఎవరూ లేరు
కాళేశ్వరం ప్రాజెక్టు కూలితే నా నింద మాపై మోపాలని బీఆర్ఎస్ చూస్తోంది
బీఆర్ఎస్ నేతలు కోరినట్లుగా మా ప్రభుత్వం నడవదు
2029లో దేశంలో జమిలీ ఎన్నికలు రాబోతున్నాయి
ఢిల్లీలో మీడియాతో సీఎం రేవంత్ చిట్ చాట్
న్యూఢిల్లీ :
రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ తుది అంకానికి చేరిందని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ వ్యవహారంపై తమ ప్రభుత్వం సిట్ తో విచారణ మొదలుపెట్టిందన్నారు. అన్ని కేసులతో పాటే ఈ కేసులోనూ దర్యాప్తు చేశామన్నారు. బాధితులిచ్చిన వాంగ్మూలాలు, సిట్ నిర్ధారణకు వచ్చి.. నిగ్గు తేల్చిన అంశాలను పరిగణలో తీసుకుని ముందుకెళ్తామని పేర్కొన్నారు. విపక్షాలు ఆరోపిస్తున్నట్లు ఈ కేసులో తమ ప్రభుత్వం ఎక్కడా వెనక్కి తగ్గలేదనీ.. తగ్గదన్నారు. ఈ వ్యవహారంలో సూత్ర, పాత్రదారులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ప్రతిపక్ష నేత కేసీఆర్‌పై తమకు ఎలాంటి కక్ష సాధింపు లేదన్నారు. ఫోన్ ట్యాపింగ్ లో సిట్ కేసీఆర్ ను దోషిగా నిర్ధారిస్తే.. ఒకవేళ కేసీఆర్‌ను జైల్లో వేయాల్సి వస్తే నిబంధనల ప్రకారమే వెళ్తామని పేర్కొన్నారు. . ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం.. గురువారం సాయంత్రం రాహుల్ గాంధీతో పాటు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో భేటీ అయ్యారు. సమావేశం ముగిసిన తర్వాత బయటకు వచ్చిన ఆయన అక్కడి మీడియాతో చిట్‌చాట్ చేశారు. ఈ సందర్భంగా సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు. తాము అధికారంలోకి వచ్చాక ఎవరి ఫోన్లు ట్యాప్ చేయడం లేదని సీఎం రేవంత్ రెడ్డి వివరణ ఇచ్చారు. ట్యాపింగ్ చేసి సంభాషణలు వింటే ఆయుష్షు తగ్గుతుందని సెటైర్లు వేశారు. ట్యాపింగ్ కాల్స్ వినడం ఓ మానసిక రోగమని వ్యాఖ్యానించారు. ఇటీవల ఖమ్మంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి.. ప్రస్తుత ప్రభుత్వంలోనూ ఫోన్లు ట్యాప్ అవుతున్నాయంటూ చేసిన ఆరోపణలపై సీఎం పరోక్షంగా వివరణ ఇచ్చారు.
తెలంగాణ రాజకీయాలు హాట్ హాట్ గా కొనసాగుతున్నాయని సీఎం చెప్పారు. ఎవరెన్ని కుట్రలు చేసినా వచ్చే కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా లేదన్నారు. తెలంగాణ రాష్ట్రానికి ప్రస్తుతం తానే రాజు.. తానే మంత్రి అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర రాజకీయాల్లో తనకు ఎవరూ పోటీ కాదన్న ఆయన.. తనకెవరూ సాటిరారన్నారు. మరో పదిన్నరేళ్ల పాటు తెలంగాణకు తానే సీఎంగా ఉంటానని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ వైపే మొగ్గు చూపారన్న ఆయన.. నేడు విడుదల కానున్న ఫలితాల్లోనూ గత ఎన్నికల ఫలితాలే పునరావృత్తమవుతాయని ధీమా వ్యక్తం చేశారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్రంలో పాలన కొనసాగుతోందన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హమీలు, వాగ్దానాలను ఒక్కొక్కటీగా అమలు చేసుకుంటూ ముందుకువెళ్తున్నామని చెప్పారు.
కేటీఆర్‌ను ఈడీ ఎందుకు విచారించదు..?
కాళేశ్వరం అక్రమాలు, ఫార్ములా ఈ-రేసుపై కేంద్ర ప్రభుత్వం చర్యలు ఎక్కడా అని సీఎం నిలదీశారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను విచారించిన ఈడీ, కేటీఆర్‌ను ఎందుకు విచారించడం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కేసుకు సంబంధించిన అన్ని డాక్యుమెంట్లను త్వరలోనే అసెంబ్లీలో అందరి ముందు పెడతానని స్పష్టం చేశారు.
కేసీఆర్, హరీశ్ రావు కోరినట్లుగా తమ ప్రభుత్వం నడువదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ మొత్తం అధ్యయనం చేయాలని, ఆ బాధ్యత ఓ నిపుణుల కమిటీకి అప్పగించామని తెలిపారు. మూడు గేట్ల మరమ్మతుల తర్వాత ప్రాజెక్టు కూలితే.. ఆ నింద తమపై వేయాలని బీఆర్ఎస్ చూస్తోందని ఆరోపించారు. కేసీఆర్ హయాం నుంచే సింగరేణికి రాష్ట్ర ప్రభుత్వం బకాయి ఉందని తెలిపారు. పదేళ్ల పాటు కేసీఆర్‌ను ఆ విషయం గురించి అడగకుండా కిషన్ రెడ్డి తనను అడుగుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
హత్యా రాజకీయాలు కాంగ్రెస్ చరిత్రలో లేవు
హత్యా రాజకీయాలు కాంగ్రెస్ చరిత్రలో లేవని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మక్తల్ మున్సిపాలిటీ పరిదిలోని ఆరో వార్డు బీజేపీ అభ్యర్ధి మృతికి కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదన్నారు. ఒక్క వార్డు గెలుపు కోసం ఎవరినో హత్య చేయ్యాల్సిన అవసరం తమకు లేదని వివరణ ఇచ్చారు. ఈ విషయంలో ఏమైనా అనుమానాలు ఉంటే సీబీఐతో విచారణ జరిపించుకోవాలని బీజేపీ నేతలను కోరారు. గురువారం అధిష్టానంతో జరిగిన సమావేశంలో కేబినెట్ విస్తరణ ప్రస్తావన రాలేదని సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు.
ఎన్టీఆర్‌కు ‘భారతరత్న’ ఇవ్వాలి
విశ్వ విఖ్యాత నట సార్వభౌముడు.. దివంగత ముఖ్యమంత్రి ఎన్ టీ రామారావుకు భారతరత్న ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ తెలుగు జాతి ఆస్తి అని.. ఆయన ఎవరి సొత్తు కాదని వెల్లడించారు. పార్లమెంటులో ఎన్టీఆర్ విగ్రహం పెట్టింది కాంగ్రెస్ పార్టీనే అని గుర్తు చేశారు. వచ్చే నెల 31 లోపు హైద్రాబాద్ మోట్రోను ప్రభుత్వం టేకోవర్ చేసే ప్రక్రియ పూర్తి చేస్తానమని సీఎం ప్రకటించారు. జూన్ 2న ఆదిలాబాద్, వరంగల్ విమానాశ్రయాలకు శంకుస్థాపన చేస్తామని తెలిపారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో సింగరేణిపై ఒకరోజు చర్చ జరిపి అన్ని విషయాలు మాట్లాడతానని వివరణ ఇచ్చారు. వాస్తవాలు చెప్పిన తర్వాత కిషన్ రెడ్డి తాను మాట్లాడినది తప్పని గ్రహించి క్షమాపణ చెప్పాలని పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో మంజూరైన ప్రాజెక్టులకు ఆంధ్రప్రదేశ్ ఎందుకు అభ్యంతరం చెబుతోందో అర్థం కావడం లేదని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. కృష్ణ, గోదావరి బేసిన్‌లో తెలంగాణకు రావాల్సిన నీటి వాటా ఇచ్చి ఆ రాష్ట్రం ప్రాజెక్టులు కట్టుకుంటే తప్పు లేదన్నారు. తెలంగాణ తన ప్రాజెక్టులు పూర్తి చేస్తే వరద జలాల లెక్కలు తేలుతాయన్నారు. నికర జలాల లెక్కల ప్రకారం తెలంగాణ ప్రాజెక్టులకు ఆంధ్రప్రదేశ్ అభ్యంతరం చెప్పకూడదని అన్నారు. గోదావరి, కృష్ణా నది బేసిన్‌లలో ప్రాజెక్టులు నిర్మించే విషయంలో ఒకే విధానం ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
Prabhakar is a sub Editor and he is working with our organisation and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.