Take a fresh look at your lifestyle.

నిబంధనలు విధిగా పాటించాలి: డిఇఓ రమేష్ కుమార్

ముద్ర ప్రతినిధి కల్వకుర్తి : ప్రైవేటు పాఠశాలలు ప్రభుత్వ నిబంధనలు తప్పక పాటించాలని అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని నాగర్ కర్నూల్ జిల్లా విద్యాశాఖ అధికారి రమేష్ కుమార్ అన్నారు. గురువారం కల్వకుర్తి పట్టణంలోని ఎస్. పీ.ఆర్ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి మాట్లాడారు. ప్రైవేటు పాఠశాలలు యాజమాన్య బోర్డు, గవర్నింగ్‌ బాడీని ఏర్పాటు చేయాలని బోర్డు సభ్యులు తప్పనిసరిగా నెలవారి సమావేశాలు నిర్వహించాలన్నారు. తల్లిదండ్రులతో ప్రతినెలా తప్పనిసరిగా సమీక్షా సమావేశాలు ఏర్పాటు చేయాలని సూచించారు.భద్రతా, ఆరోగ్య పరిశుభ్రతా కమిటీల ఆధ్వర్యంలో విద్యార్థులకు మాదక ద్రవ్యాలకు, ఇంటర్నెట్‌కు బానిసలు కాకుండా అవగాహన కల్పించాలన్నారు. నియమ నిబంధనలకు లోబడి ఫీజులు ఉండాలని, ఎట్టి పరిస్థితుల్లో పాఠశాలలో పుస్తకాలు, నోట్‌పుస్తకాలు, యూనీఫాం విక్రయించవద్దని స్పష్టం చేశారు.స్కూల్‌ బస్సులు భద్రతా నియమాలు పాటించేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. బస్సులో విద్యార్థుల పూర్తిరక్షణకు రోడ్‌సైడ్‌ పాఠశాలలు తప్పనిసరిగా రోడ్డుపై జీబ్రా క్రాసింగ్‌ ఏర్పాటు చేసుకోవాలన్నారు. పాఠశాలల్లో తప్పనిసరిగా అగ్నిమాపక భద్రతా చర్యలు తీసుకోవాలన్నారు. ఆటలు, సాంస్కృతిక కార్యక్రమాలను పాఠ్య ప్రణాళికలోభాగం చేయాలన్నారు. పాఠశాల భవనాలు పూర్తి భద్రతతో ఉండాలని, ఓపెన్‌ కారిడార్‌ ఉన్న అంతస్తుల్లో గ్రిల్స్‌ ఏర్పాటు చేయాలని సూచించారు.పాఠశాల విద్యార్థులతో మాట్లాడి విద్యార్థుల చదువు, ఫీజులు తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు.

Leave A Reply

Your email address will not be published.