ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్:
నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలంలోని నంది వడ్డేమాన్ గ్రామంలో వెలిసిన శ్రీ నందీశ్వర శనేశ్వర స్వామి దేవస్థానంలో 26వ వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 31వ తేదీ నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు మూడు రోజులపాటు ఘనంగా నిర్వహించనున్నట్లు దేవస్థానం చైర్మన్ వెల్దండ గోపాలరావు, ప్రధాన అర్చకులు డాక్టర్ గవ్వమఠం విశ్వనాథ శాస్త్రి తెలిపారు.

మార్చి 31వ తేదీ మంగళవారం చైత్ర మాసం త్రయోదశి సందర్భంగా ఉదయం 9 గంటలకు పరమశివునికి విశేష రుద్రాభిషేకం, బిల్వార్చన, అమ్మవారికి కుంకుమార్చన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అదే రోజు సాయంత్రం 5 గంటలకు శివపార్వతుల కళ్యాణోత్సవం, అగ్ని ప్రతిష్ఠ, దీక్ష హోమం జరుగుతాయి.
ఏప్రిల్ 1వ తేదీ బుధవారం చతుర్దశి సందర్భంగా శ్రీ జేష్టాదేవి సమేత శనేశ్వర స్వామికి శతకుంభ మహాన్యాస పూర్వక తిలతైల అభిషేకం, శనేశ్వర హవనం, మహామంగళహారతి నిర్వహిస్తారు. సాయంత్రం 5 గంటలకు శనేశ్వర స్వామి వారి కళ్యాణోత్సవం, అమ్మవారికి కుంకుమార్చన, రుద్రహోమం జరుగుతాయి.
ఏప్రిల్ 2వ తేదీ గురువారం చైత్ర పౌర్ణమి సందర్భంగా ఉదయం 10 గంటలకు శ్రీ ఉమామహేశ్వర స్వామి వ్రతం, శాంతి హోమం, బలిహరణ, పూర్ణాహుతి కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అదే రోజు సాయంత్రం 4 గంటలకు నంది వడ్డేమాన్ గ్రామంలో బండ్లు తిరుగుట కార్యక్రమం నిర్వహిస్తారు.
ఈ మూడు రోజులపాటు జరిగే బ్రహ్మోత్సవాలలో పాల్గొనే భక్తులకు మధ్యాహ్నం అన్నప్రసాదం ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఉదయం, సాయంత్రం తీర్థప్రసాదాలు కూడా అందజేస్తారు.
ప్రత్యేక మహాన్యాస పూర్వక తిలతైల అభిషేక పూజలో ప్రత్యక్షంగా లేదా వర్చువల్‌గా పాల్గొనదలచిన భక్తులు రూ. 258 చెల్లించి, ఫోన్‌పే ద్వారా 94402 31325 లేదా 8186821212 నంబర్లకు పంపి వాట్సాప్ ద్వారా వివరాలు పంపించాలని సూచించారు.
ఈ బ్రహ్మోత్సవాలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ శనేశ్వర స్వామి కృపాకటాక్షాలు పొందాలని దేవస్థానం అధికారులు కోరారు.