Take a fresh look at your lifestyle.

నేటి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు షురూ… కేసీఆర్ రాకపై ఆసక్తి

ఈసారి కొత్త పథకాలపై కీలక ప్రకటన
పెన్షన్లు పెంపు, మహిళలకు నెలకు రూ 2,500
అమలు ముహూర్తం..!

ముద్ర తెలంగాణ బ్యూరో :
సీఎం రేవంత్ మరో ఎన్నికల హామీ అమలు దిశగా కసరత్తు చేస్తున్నారు. కాంగ్రెస్ ఏర్పాటు అయిన తరువాత వరుసగా పథకాలను అందిస్తున్నారు. ఇప్పుడు, పెండింగ్ లో ఉన్న రెండు పథకాలను అమలుకు సిద్దమవుతున్నారు. మహిళలకు రూ 2, 500, పెన్షన్లు 4 వేలకు పెంపు పైన ప్రకటన కు తుది కసరత్తు చేస్తున్నారు. ఈ మేరకు సోమవారం నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశ పెట్టే బడ్జెట్ లో ప్రకటన దిశగా చర్చలు సాగుతున్నట్లు సమాచారం.
రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమావే శాలు ఉదయం 11:45 గంటలకు ప్రారంభం కానున్నాయి. ఈ సారి అసెంబ్లీకి కొత్త గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా తొలిసారి రానున్నారు. గవర్నర్ ప్రసంగంతో ఉభయ సభలు ప్రారంభం కానున్నాయి. పదిరోజుల పాటు సమావేశాలను నిర్వహించాలనే యోచనలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఉంది. సభ ప్రాంగణంలో సోమవారం తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ సమావేశాల్లో ప్రవేశ పెట్టనున్న బడ్జెట్ పై ఇప్పటికే ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క నేతృత్వంలో శాఖలవారీగా ప్రీ బడ్జెట్ సమావేశాలను పూర్తి చేశారు. అన్ని శాఖల మంత్రులు, అధికారులతో మంత్రి భట్టి విక్రమార్క సమీక్షలు నిర్వహించారు. ఈసారి బడ్జెట్‌లో సంక్షేమానికి, అభివృద్ధికి పెద్దపీట వేయనున్నట్లు తెలుస్తోంది. రైతు సంక్షేమం, మహాలక్ష్మి, ఇందిరమ్మ ఇళ్లు, గృహజ్యోతి వంటి ఆరు గ్యారంటీల అమలుకు భారీగా నిధులు కేటాయించే అవకాశం ఉంది.

పెండింగ్ హామీల అమలుకు నిధుల కేటాయింపు
అధికారంలోకి వచ్చి రెండున్నారేళ్లు పూర్తి కానుండటంతో… ప్రభుత్వం పెండింగ్ హామీల అమలు దిశగా కసరత్తు చేస్తోంది. పెండింగ్ హామీల అమలు పై బడ్జెట్ లో స్పష్టత అందులో భాగంగా వచ్చే ఆర్దిక సంవత్సరం నుంచి ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 18 ఏళ్లు నిండిన మహిళలకు నెలకు రూ 2, 500 .. అదే విధంగా పెన్షన్ రూ 4,000 కు పెంపు పైన ప్రకటన ఉండే అవకాశం కనిపిస్తోంది. అదే విధంగా.. కొత్త సంక్షేమ పథకాలు, నీటిపారుదల, మౌలిక సదుపాయాలు, పట్టణాభివృద్ధి వంటి అంశాలపై ప్రభుత్వం దృష్టి సారించనుంది. ఈసారి అసెంబ్లీ సమావేశాల్లో పెన్షన్ల విషయంలో కీలక నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. ఈ కేబినెట్‌లో బడ్జెట్‌ సమావేశాలపై అధికారిక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. సంక్రాంతి సమయంలోనే ఈ రెండు పథకాల అమలు పైన ప్రకటన ఉంటుందని భావించారు. అయితే, ఆర్దిక పరిస్థితుల కారణంగా ఆలస్యం అయింది. త్వరలో జెడ్పీ ఎన్నికలతో పాటుగా మూడు కార్పోరేషన్లు గా విభజించిన గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో… సంక్షేమంతో పాటుగా పెండింగ్ హామీల అమలు పైన బడ్జెట్ లో ప్రకటన చేసేందుకు కసరత్తు జరుగుతోంది. ఈ నేపథ్యం లో బడ్జెట్ పైన రాజకీయంగానూ ఆసక్తి నెలకొంది.

కేసీఆర్ వస్తారా..?
అసెంబ్లీ సమావేశాలకు విపక్ష నేత కేసీఆర్ ప్రతిసారి డుమ్మా కొడుతూనే ఉన్నారు. గత అసెంబ్లీ సమావేశాలకు అలా వచ్చి.. సంతకం పెట్టి వెళ్లిపోయారు. ఈసారి బడ్జెట్ సమావేశాలు కావడంతో.. కేసీఆర్ వస్తేనే బాగుంటుందని గులాబీ ఎమ్మెల్యేలు కూడా బావిస్తున్నారు. కానీ, కేసీఆర్ హాజరుకావడంపై ఎలాంటి సమాచారం రావడం లేదు.

అధికార, ప్రతిపక్షాల కసరత్తులు

శాసనసభ, శాసనమండలిలో ప్రతిపక్షాలు లేవనెత్తే అంశాలకు సమాధానం ఇవ్వడంతో పాటుగా.. పెండింగ్‌లో ఉన్న పలు కీలక బిల్లులను కూడా ఈ సమావేశాల్లోనే ఆమోదించుకునేందుకు ప్రభుత్వం సిద్దమవుతుంది. ముఖ్యంగా ప్రతిపక్షాలు చేసే విమర్శల దాడిని తిప్పికొట్టడంతో అవసరమైన వ్యూహ ప్రతివ్యూహాలపై మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే మార్గదర్శకం చేశారు. అటు ప్రతిపక్ష బీఆర్ఎస్ సైతం అసెంబ్లీ సమావేశాల్లో లేవనెత్తాల్సిన అంశాలపై, అనుసరించాల్సిన వ్యూహాలపై తాజాగా పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు శిక్షణా తరగతులు నిర్వహించడం గమనార్హం. బీజేపీ, ఎంఐఎం సైతం తమ వ్యూహాల మేరకు ప్రభుత్వంపై దాడికి అస్త్రశస్త్రాలకు పదును పెట్టాయి.

రైతులు, నిరుద్యోగుల సమస్యలు, ఆరు గ్యారెంటీలపై ఈ సమావేశాల్లో చర్చ జరిగే అవకాశం ఉంది. మూసీ ప్రక్షాళన, హిల్ట్ పాలసీ, హైడ్రా, భూదాన్ భూములు, భూ భారతీ, కాళేశ్వరం మరమ్మతులు, కాంగ్రెస్ ఎన్నికల హామీలు, ఫ్యూచర్ సిటీ, విదేశీ పెట్టుబడులు, రైతు భరోసా పెండింగ్, జీహెచ్ఎంసీ మూడు కార్పోరేషన్ల విభజన, కాంగ్రెస్ పాలనలో చేసిన అప్పులు, సింగరేణి నైనీ బొగ్గు టెండర్ వివాదం, నిధుల దుర్వినియోగం, పార్టీ ఫిరాయింపులు, విద్యారంగ సమస్యలు వంటి అంశాలను ప్రతిపక్షాలు లేవనెత్తనున్నాయి. ప్రతిపక్షాలకు కౌంటర్ గా కాంగ్రెస్ ఫోన్ ట్యాపింగ్, ఫార్ములా ఈ రేస్, కాళేశ్వం వంటి అంశాలతో ఎదురుదాడికి దిగే అవకాశం ఉంది. దీంతో ఈ సమావేశాలు అధికార, ప్రతిపక్షాల మధ్య విమర్శల పర్వంతో వేసవి ఎండలను మరిపించే స్థాయిలో వాడివేడిగా సాగడం ఖాయంగా కనిపిస్తుంది.

భారీ బందోబస్తుతో రక్షణ వలయం

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్బంగా ఉభయసభల సమావేశాలు సజావుగా కొనసాగేందుకు అధికారులు భారీ భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. అసెంబ్లీ ప్రాంగణం పరిసరాల చుట్టు పోలీసులు కంచెలను, బారీ కేడ్లను ఏర్పాటు చేశారు. పలు ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు, ప్రతిపక్ష పార్టీల అనుబంధ సంఘాలు ప్రజా సమస్యలపై అసెంబ్లీ ముట్టడి నిర్వహించే అవకాశం ఉండటంతో పోలీసులు ముందస్తుగా భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యంగా ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ నేతలు మరోసారి సమ్మె నోటీసు ఇవ్వడం..ప్రభుత్వం ఈ నెల 26వరకు స్పందించని పక్షంలో మెరుపు సమ్మెతో పాటు అసెంబ్లీ ముట్టడి నిర్వహిస్తామని హెచ్చరించిన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు.

Leave A Reply

Your email address will not be published.