- వచ్చే విద్యాసంవత్సరం నుంచి పాఠ్యాంశంగా రహదారి భద్రత
- రోడ్డు భద్రతపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం
- రహదారి భద్రత మన అందరి బాధ్యత
- ట్రాఫిక్ నిబంధనలను సామాజిక బాధ్యతగా భావించాలి
- రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
ముద్ర, తెలంగాణ బ్యూరో : ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేస్తామని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్చరించారు.ట్రాఫిక్ నిబంధనలను ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా భావించి పాటించాలని సూచించారు. శుక్రవారం హెచ్ఎండిఏ గ్రౌండ్స్ ఎన్టీఆర్ మార్క్ లో రోడ్డు భద్రత అవగాహన నెక్లెస్ రోడ్ నుంచి ప్లాజా వరకు నిర్వహించిన వాకథన్ కార్యక్రమాన్ని మంత్రి జెండా ఊపి ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రహదారి భద్రతపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు.రోడ్డు ప్రమాదాలను నివారించడానికి రహదారి భద్రతను పాఠ్యాంశంగా తీసుకోవడం జరుగుతుందన్నారు.ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించి తమ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలు రక్షించాలని అన్నారు.రోడ్డు భద్రత మాసోత్సవాలు ఈ నెల 1న సీఎం రేవంత్ రెడ్డికి హెల్మెట్ ధరించి ప్రారంభించామన్నారు.
దాదాపు 15 లక్షల మంది విద్యార్థులను ప్రజలను భాగస్వామ్యం చేసి 33 జిల్లాల్లో అనేక కార్యక్రమాలు చేసినట్లు చెప్పిన పొన్నం..వాటిని విజయవంతం చేసినందుకు రవాణా శాఖ అధికారులకు అభినందనలు తెలిపారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా 33 జిల్లాల్లో కలెక్టర్లు,ఎస్పీ ,ప్రజా ప్రతినిధులు మాసోత్సవాల్లో పాల్గొన్నారని చెప్పారు.ఇందులో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 10 లక్షల మంది భాగస్వామ్యం అయ్యారన్నారు.దేశంలో వేరే రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలోనే గొప్పగా నిర్వహించామన్నారు. గతేడాది దేశంలో 5.70లక్షల రహదారి ప్రమాదాలు జరిగాయని 1,68,491మరణాలు సంభవించాయని 4,43,366 మంది గాయాల పాలయ్యారని తెలిపారు. గతేడాది తెలంగాణలో 26 వేల రోడ్డు ప్రమాదాలు సంభవించగా 7700 మంది ప్రాణాలు కోల్పోగా 20వేల మంది గాయాల పాలయ్యారన్నారు.ఈ లెక్కన రాష్ట్రంలో రోజుకు సగటున 18 మరణాలు సంభవిస్తున్నాయని అన్నారు.రోడ్డు ప్రమాదాలు నివారించడానికి సేఫ్ డ్రైవర్స్ కార్యక్రమాన్ని విద్యా,అమలు,ఇంజనీరింగ్,అత్యవసర సేవలు కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. ప్రతి స్కూల్ లో ట్రాఫిక్ చిల్డ్రన్ అవేర్నెస్ పార్క్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.
రాష్ట్రంలో ఎక్కడైతే ప్రమాదాలు జరిగే ప్రాంతాలు బ్లాక్ స్పాట్స్ లను ప్రాంతాలు గుర్తించివాటిని తొలగించి అక్కడ రోడ్డు ప్రమాదాలు జరగకుండా ప్రభుత్వం చూస్తుందన్నారు.రాబోయే కాలంలో విద్యార్థులు చదువుకోవడానికి రహదారి భద్రతను పాఠ్యాంశంగా చేర్చుతామన్నారు. రవాణా శాఖ అధికారులు,ట్రాఫిక్ రూల్స్ పై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారని తెలిపారు.చట్టంలో ఎవరైతే ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తారో భవిష్యత్ లో లైసెన్స్ లేకుండా రవాణా శాఖ కఠిన చర్యలు తీసుకుంటుందన్నారు.నిబంధనలు ఉల్లంఘించి ప్రాణాలు పోవడానికి కారకులైన వారిని ఒక దోషి గా నిలబెట్టే ప్రచారం చేసే కార్యక్రమాన్ని తీసుకుంటామన్నారు.ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్,ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి,కార్పొరేటర్ విజయ రెడ్డి, రవాణా శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్,రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్ సురేంద్ర మోహన్, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, రవాణా శాఖ జాయింట్ కమిషనర్లు,ఎన్సిసి, ఎన్ వై కే, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.