ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి :
స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దివ్య పాదారవిందములకు ఒక వంద ఎనిమిది బంగారు అష్టదళ పద్మ పుష్పాలతో అష్టోత్తర శతనామాలతో అష్టదళ పాదపద్మార్చన సేవ బుధవారం నిర్వహించారు.
కలియుగ ప్రత్యక్ష దైవమైన స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి ప్రాతఃకాలంలో అర్చక స్వాములు సుప్రభాత సేవను విశేషంగా నిర్వహించి అనంతరం శ్రీ మహాలక్ష్మి అమ్మవారు, ముప్పది మూడు కోట్ల దేవతలు కొలువుతీరినట్టి గోపృష్ట దర్శనాన్ని చేయించారు. సువర్ణ బిందె తీర్ధమును బంగారుబావి నుండి తీసుకువచ్చారు. మని మయ శోభిత స్వర్ణాభరణాలతో పరిమళభరిత పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించి వేయి నామాల శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి సహస్ర నామార్చన సేవను గావించారు. లోక కళ్యాణం కోసం అర్చక స్వాములు శ్రీ సుదర్శన నారసింహ హవనంను చేశారు. స్వామివారి నిత్య కళ్యాణ మహోత్సవాన్ని శ్రీవారి వైభవోత్సవ మండపంలో వేదమంత్రాలతో మంగళ ధ్వనుల మధ్య అంగరంగ వైభవంగా అర్చక స్వాములు నిర్వహించారు.