-ప్రతీ వారం సినిమా చూస్తున్నారా అని విద్యార్థులకు కలెక్టర్ ప్రశ్న?
-లక్ష్య చేధన కు నిరంతర సాధన చేయాలి
ముద్ర, నారాయణపేట :
కొత్త కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్ళాలని…విద్యార్థులు జీవితంలో ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలని, ఆ లక్ష్య చేధన కు నిరంతర సాధన చేయాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ సూచించారు. శనివారం ఆయన మద్దూరు మండలంలోని పెదిరి పాడ్ గ్రామంలో గల కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆ పాఠశాలలోని వంట గది, మరుగు దొడ్లు, స్టాక్ రూమ్, ఆర్వో ప్లాంట్ ను పరిశీలించారు. అనంతరం పాఠశాలలోని ఎనిమిదో తరగతి గదిలోకి వెళ్ళి విద్యార్థినిలతో ముచ్చటించారు. పాఠశాలలో భోజనం, ఇతర వసతి సౌకర్యాలు, చదువు గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.

అన్ని బాగున్నాయని విద్యార్థినిలు కలెక్టర్ కు తెలిపారు. ప్రతీ వారం సినిమా చూస్తున్నారా అని ఆరా తీశారు. ఇకపై ప్రతీ శనివారం విద్యార్థినులకు పాఠశాలలో మంచి సందేశాత్మక సినిమాలను చూపించాలని ఎస్. వో కు ఆయన సూచించారు. తరగతి గదిలోని విద్యార్థినుల జీవితాశయం, లక్ష్యం గురించి ఒక్కరిని అడగడంతో కొందరు ఐ ఏ ఎస్, ఐ పీ ఎస్, మరికొందరు డాక్టర్ అవుతామని తెలపగా ఆర్కిటెక్, సైంటిస్ట్ లు ఎవరూ కారా అని ప్రశ్నించారు. కొత్త కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్ళాలని సూచించారు. వారి వారి పుస్తకాల్లో విద్యార్థినుల పేర్లు రాయించారు. తర్వాత పేర్ల ముందు వారు ఏం కావాలని అనుకుంటున్నారో ఆ డీజిగ్ నేషన్ ను రాయించి, రోజూ పుస్తకం తెరిచి చూస్తే తాము భవిష్యత్తులో ఆ డీజిగ్ నేషన్ చేరుకునేందుకు కష్టపడి చదవాలని తెలిపారు. కేవలం కలెక్టర్, డాక్టర్, ఇంజినీర్ అవుతాం అనుకుంటే సరిపోదని, ఆ స్థాయిని చేరుకునేందుకు ప్రణాళిక ప్రకారం చదువు కోవాలన్నారు.