Take a fresh look at your lifestyle.

పాలెం ఇండస్ట్రియల్ పార్క్ సందర్శించిన సైన్స్ డిగ్రీ విద్యార్థులు

 

నాగర్ కర్నూల్, ముద్ర ప్రతినిధి:
నాగర్ కర్నూల్ ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాల విద్యార్థులు బిజినపల్లి మండలంలోని పాలెం ఇండస్ట్రియల్ పార్క్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న ప్లాస్టిక్ రీసైక్లింగ్ కర్మాగారాన్ని పరిశీలించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ మదన్ మోహన్ తెలిపారు.

నేషనల్ గ్రీన్ కార్ప్స్ తెలంగాణ మరియు కళాశాల ఈకో క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ క్షేత్ర పర్యటనలో విద్యార్థులకు పర్యావరణ పరిరక్షణ, ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణపై అవగాహన కల్పించడం ముఖ్య ఉద్దేశ్యంగా ఉన్నట్లు పేర్కొన్నారు. కాలుష్య నియంత్రణ మండలి అధికారి దివ్య పాల్గొని విద్యార్థులకు పర్యావరణ సంరక్షణపై సూచనలు చేశారు.

ఫీల్డ్ విజిట్‌లో భాగంగా ఫిలిక్స్ ఎకో గ్రీన్ ఎనర్జీ సంస్థకు చెందిన పారిశ్రామికవేత్త వేణు తుమ్మల ప్లాస్టిక్ రీసైక్లింగ్ ప్రాముఖ్యత, ప్రక్రియ, ప్రయోజనాలను వివరిస్తూ ప్రత్యక్ష ప్రదర్శన ఇచ్చారు. వ్యర్థ ప్లాస్టిక్‌ను శుద్ధి చేసి మళ్లీ ఉపయోగపడే పదార్థాలుగా మార్చే విధానాన్ని విద్యార్థులకు చూపించారు.

ప్రిన్సిపాల్ మదన్ మోహన్ మాట్లాడుతూ, సమాజాన్ని వేధిస్తున్న ప్లాస్టిక్ సమస్యకు పరిష్కార మార్గాలను తెలియజేయడం, విద్యార్థుల్లో బాధ్యతాభావం పెంపొందించడం కోసం ఈ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. దక్షిణ భారతదేశంలోనే తొలిసారిగా స్థాపించబడిన ఈ ప్లాస్టిక్ రీసైక్లింగ్ కేంద్రం పాలెంలో ఉండటం గర్వకారణమని అన్నారు.

ఈ కేంద్రంలో ప్రతిరోజూ సుమారు 5 టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలను రీసైక్లింగ్ చేసి ఆయిల్, గ్యాస్, కార్బన్ వంటి ఉత్పత్తులుగా మారుస్తూ ‘జీరో ప్లాస్టిక్ వ్యర్థం’ లక్ష్యంతో పనిచేస్తున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో విద్యార్థులు, అధ్యాపకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.