- వరుస చోరీల దొంగల పట్టివేత.
ముద్ర ప్రతినిధి,నిర్మల్: జల్సాలకు మరిగి, వరుసగా దొంగతనాలకు పాల్పడుతున్న మహారాష్ట్రకు చెందిన ముగ్గురిని నిర్మల్ జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. గురువారం జరిగిన విలేఖరుల సమావేశంలో ఎస్పీ జానకి షర్మిల వివరాలను వెల్లడించారు. మహారాష్ట్రలోని ఉమ్రికి చెందిన రాజు సింగ్ మోహన్ సింగ్ భవారి, సేవక్ సింగ్ రఘుబీర్ సింగ్, సుర్దీప్ సింగ్ జూని లు బంధువులు. మద్యానికి, జల్సాలకు బానిసలుగా మారిన వీళ్లు కూలీ పనులు చేస్తున్నారు. ఐతే వచ్చిన డబ్బులు సరిపోక దొంగతనాలు చేయడం ద్వారా సులభంగా డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్నారు. పథకం ప్రకారం లక్ష్మణ చాంద మండలం కనకాపూర్ గ్రామానికి చేరుకున్నారు. అక్కడ పెట్రోల్ బంక్ సమీపంలోని ఒక ఇంటి ముందున్న బైక్‌ను దొంగిలించారు. అదే గ్రామంలోని నగల దుకాణానికి వెళ్లి తాళాలు పగలగొట్టి బంగారు, వెండి ఆభరణాలు దొంగతనం చేశారు. తిరిగి తమ స్వస్థలం ఉమ్రికి తిరిగి వెళుతూ కల్లూరులో రెండు దుకాణాల్లో దొంగతనానికి పాల్పడ్డారు. వరుస దొంగతనాల నేపథ్యంలో ఎస్పీ డా. జి. జానకి షర్మిల సోన్ సీఐ గోవర్ధన్ రెడ్డి నేతృత్వంలో ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. నిందితులు నిర్మల్లో ఆభరణాలను అమ్మేందుకు వచ్చిన సమాచారంతో అప్రమత్తమైన ప్రత్యేక బృందం వారిని అదుపులోకి తీసుకుంది.నిందితుల నుండి 2.7 కిలోల వెండి, 17 గ్రాముల బంగారం, రూ.2500 నగదు, మోటార్ సైకిల్ ను స్వాధీనం చేసుకున్నారు. కేసులో చాకచక్యంగా వ్యవహరించిన సి ఐ గోవర్ధన్ రెడ్డి, లక్ష్మణ్ చంద ఎస్ ఐ శ్రీనివాస్, ప్రదీప్ కుమార్, మామడ ఎస్సై అశోక్, సిబ్బంది సందీప్, ప్రమోద్, జగన్ సింగ్, తిరుపతి, సుబాష్, సతీష్ రెడ్డి, సంతోష్, కిరణ్, గణేష్, వినోద్ లను ప్రత్యేకంగా అభినందించారు.