సిద్దిపేట, ముద్ర ప్రతినిధి :
గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల పండిట్, పిఈటి పోస్టులను వెంటనే అప్ గ్రేడ్ చేయాలని తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు గాడిపల్లి తిరుపతి రెడ్డి డిమాండ్ చేశారు.
రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు గిరిజన ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం మూడు దశల పోరాట కార్యక్రమాలలో భాగంగా కలెక్టర్ల ద్వారా ప్రభుత్వానికి వినతి పత్రాలు సమర్పించే కార్యక్రమంలో గురువారం సిద్దిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలోవినతి పత్రం సమర్పించారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ విద్యాశాఖలో మాదిరిగానే గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలలో పనిచేస్తున్న ద్వితీయ శ్రేణి తెలుగు, హిందీ పండితుల వ్యాయామ ఉపాధ్యాయుల పోస్టులను స్కూల్ అసిస్టెంట్ స్థాయి పోస్టులుగా ఉన్నతీకరించి, పదోన్నతులు ఇవ్వాలన్నారు.గత సంవత్సరం కాంట్రాక్టు రెసిడెన్షియల్ టీచర్స్ (CRT)కు సమ్మె సందర్భముగా ఇచ్చిన హామీలను అమలు చేసి, మినిమం టైం స్కేల్ వర్తింపజేసి, రెగ్యులరైజ్ చేయాలని, ప్రతి నెల ఒకటవ తేదీన వేతనాలు చెల్లించాలని,విద్యాశాఖ మాదిరిగానే బదిలీలు పదోన్నతులు చేపట్టాలన్నారు
రాష్ట్రంలోని అన్ని గిరిజన వసతి గృహాలను ఆశ్రమ పాఠశాలలుగా కన్వర్ట్ చేయాలని, కన్వర్టెడ్ ఆశ్రమ పాఠశాలలకు, నూతన ఆశ్రమ పాఠశాలలకు పాటర్న్ ప్రకారం పోస్టులను మంజూరు చేయాలని.అన్ని ఆశ్రమ పాఠశాలలకు విద్యార్థుల సంఖ్యాబలం, సెక్షన్ల ఆధారంగా పోస్టులను మంజూరు చేయాలన్నారు.అన్ని ప్రాథమిక పాఠశాలలకు PS HM పోస్టులను మంజూరు చేయాలని,317 జీవో అప్పీల్లన్నింటినీ పరిశీలించి పరిష్కరించాలని,ప్రత్యేక TRTని నిర్వహించి ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయాలని,గిరిజన సంక్షేమ ఉపాధ్యాయులకు, ఉద్యోగులకు కామన్ సర్వీస్ రూల్స్ ను రూపొందించి ప్రమోషన్లకు అవకాశం కల్పించాలని అన్నారు
కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు చిట్యాల విజేందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి సుంచు నరేందర్,సిద్దిపేట అర్బన్, కొమురవెల్లి మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అనిల్ కుమార్,రాంకిషన్,దశరథం, శివరాజం, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు