- ఐదు గ్రామాల ప్రజలకు తగ్గనున్న ప్రయాణ భారం.
రామకృష్ణాపూర్, ముద్ర విలేకరి : పట్టణంలోని రామాలయం మీదుగా పులిమడుగు,బొక్కల గుట్ట,మేడారం,అందుగుల పేట,కోటేశ్వర్ రావు పల్లెకు వెళ్లేందుకు సులువుగా ఉన్న రవాణా మార్గం గత కొన్నేళ్లుగా మూత పడింది. సైకిల్,ద్విచక్ర వాహనాలు వెళ్లేందుకు సులువుగా ఉన్న అండర్ పాస్ బురద,మట్టితో నిండి పోవడంతో అప్పట్లో గ్రామాల ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారు. ప్రస్తుతం చిన్న అండర్ పాస్ మూసివేయడంతో పాటు మరో అండర్ పాస్ కింద నుంచి వెళ్ళేందుకు లేకుండా పోయింది. దీంతో ఆ గ్రామాలకు చేరుకోవాలంటే క్యాతన్ పల్లి,గద్దె రాగడి హైవే మీదుగా ప్రయాణం చేయాల్సి వస్తుంది. సుమారుగా ఎనిమిది నుంచి పది కిలో మీటర్ల వరకు అదనపు ప్రయాణ భారం పడుతుంది. రైల్వే అండర్ పాస్ ఏర్పాటు కొరకు “ముద్ర” అందిస్తున్న ప్రత్యేక కథనం.
- అండర్ పాస్ ఏర్పాటుతో మేలు.
మందమర్రి రవీంద్రఖని రైల్వే లైన్ మధ్యలో కొత్త అండర్ పాస్ ఏర్పాటు చేస్తే చుట్టూ పక్కల గ్రామాలకు చెందిన ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని పట్టణ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కంభగోని సుదర్శన్ గౌడ్ తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అప్పటి చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ రైల్వేశాఖ అధికారులతో మాట్లాడి అండర్ పాస్ ఏర్పాటు,రహదారి నిర్మాణానికి కృషి చేసినట్లు ఆయన గుర్తు చేశారు. ఐదు గ్రామాలకు చెందిన ప్రజలు పట్టణానికి రావాలంటే ఇదే సులువైన మార్గమని చెప్పారు. నూతన అండర్ పాస్ నిర్మాణం జరిగితే ప్రయాణం మరింత సులభం అవుతుందన్నారు.
బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు కంభగోని సుదర్శన్ గౌడ్.

ఐదు గ్రామాలకు తగ్గనున్న ప్రయాణ భారం.
రామాలయం మీదుగా ఉన్న రహదారి ద్వారా పులిమడుగు వెళ్లేందుకు కొత్త అండర్ పాస్ ఏర్పాటు చేస్తే ఐదు గ్రామాలకు చెందిన ప్రజలకు ప్రయాణ భారం తగ్గుతుందని పులిమడుగు గ్రామానికి చెందిన భూక్యా రాజు నాయక్ తెలిపారు.n అవసరమైతే చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్,పెదపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ దృష్టికి సమస్యను తీసుకెళ్తానన్నారు. పులిమడుగు, బొక్కల గుట్ట,మేడారం,అందుగుల పేట,కోటేశ్వర్ రావు పల్లె గ్రామా ప్రజల సౌకర్యార్థం రైల్వే శాఖ అధికారులు పరిశీలించి అండర్ పాస్ ఏర్పాటుకు కృషి చేయాలని కోరుతున్నారు.
పులిమడుగు గ్రామస్తుడు భూక్యా రాజు నాయక్
