ముద్ర కాప్రా
బాల్య వివాహాల నివారణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు ప్రజల సహకారం ఎంతో అవసరమని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అన్నారు.
బాల్య వివాహాల నిర్మూలన లక్ష్యంగా తెలంగాణ రాష్ట్రంలో నిర్వహిస్తున్న 100 రోజుల బాల్య వివాహాల నిర్మూలన – చిల్డ్రన్స్ మ్యారేజ్ ఫ్రీ భారత్ అవగాహన కార్యక్రమంలో భాగంగా ఉప్పల్ నియోజకవర్గంలో సోమవారం జరిగిన కార్యక్రమంలో బండారి లక్ష్మారెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బాల్య వివాహాలు సమాజానికి శాపమని, ముఖ్యంగా బాలికల భవిష్యత్తును నాశనం చేసే దుష్ప్రభావం కలిగిస్తాయని పేర్కొన్నారు. 18 ఏళ్ల లోపు అమ్మాయిలకు, 21 ఏళ్ల లోపు అబ్బాయిలకు వివాహాలు చేయడం చట్టరీత్యా నేరమని స్పష్టం చేస్తూ, తల్లిదండ్రులు, ప్రజాప్రతినిధులు, సమాజంలోని ప్రతి ఒక్కరూ దీనిపై అవగాహన కలిగి బాధ్యతగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు.
ప్రతి గ్రామం, ప్రతి కాలనీలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి బాల్య వివాహ రహిత తెలంగాణ లక్ష్యాన్ని సాధించాల్సిన అవసరం ఉందని అన్నారు.
ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.