Take a fresh look at your lifestyle.

చర్లపల్లి పారిశ్రామికవాడ అభివృద్ధికి కృషి చేస్తాం

  • ఐలా చైర్మన్ గోవిందరెడ్డి.
  • సి ఐ ఏ అధ్యక్షుడు డిఎస్ రెడ్డి.

కుషాయిగూడ , ముద్ర విలేఖరి: చర్లపల్లి పారిశ్రామికవాడ మరింత అభివృద్ధికి కృషి చేస్తామని ఐలా చైర్మన్ డాక్టర్ కె. గోవిందరెడ్డి, సిఐఏ అధ్యక్షుడు డి శ్రీనివాస రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం జరిగిన చర్లపల్లి ఇండస్ట్రియల్ ఎన్నికల్లో విజయం సాధించిన వీరు సోమవారం సిఐఏ భవన్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి భవిష్యత్తులో వారు చేపట్టే అభివృద్ధి పనులు, ప్రణాళికలను వెల్లడించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను యుద్ధ ప్రతిపాదికన చేపడతామని చెప్పారు. చర్లపల్లి పారిశ్రామిక వార్డులో మౌలిక సదుపాయాల కల్పన, చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధి, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు ప్రణాళిక బద్ధంగా ముందుకు వెళుతున్నట్లు తెలిపారు. ఆటో రిక్షాలతో పగడ్బందీగా చెత్తను తరలించి స్వచ్ఛ చర్లపల్లి పారిశ్రామికవాడగా తీర్చిదిద్దుతామన్నారు. ఇక మహిళలకు, పురుషులకు వేరువేరుగా వర్కర్స్ వెల్ఫేర్ హాస్టల్స్ ను నిర్మిస్తామని తెలిపారు. ఇందుకుగాను స్థలం ను సేకరించి సిఎస్ఆర్ నిధులతో భవన నిర్మాణాలు చేపడతామన్నారు. తక్కువ ధరకు విలువైన పోషకాలు ఉండే భోజన కేంద్రాలను, చైల్డ్ కేర్ కేంద్రాల ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే పారిశ్రామికవాడ ఉద్యోగ, కార్మికుల వైద్య సంరక్షణకు ఉచిత వైద్య శిబిరాలు, యోగ శిక్షణ తరగతులను నిర్వహిస్తామన్నారు. ఇక నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే దిశగా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాములను నిర్వహిస్తామని, కార్మికులకు ఇన్సూరెన్స్, ఉత్పత్తుల ప్రదర్శనశాల ఏర్పాటు చేస్తామన్నారు. పారిశ్రామికవేత్తలకు న్యాయ సలహా కేంద్రాన్ని అందుబాటులో ఉంచుతామన్నారు. ఇక బ్యాంకుల సహకారంతో పాటు తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న ఫైనాన్స్ హెల్త్ క్లినిక్ పై పారిశ్రామికవేత్తలకు అవగాహన సదస్సులో నిర్వహించి వారిని చైతన్య పరుస్తామన్నారు.చర్లపల్లి పారిశ్రామికవాడలో డయాలసిస్ చికిత్స కేంద్రాన్ని ఏర్పాటు చేసే బాధ్యత తమపై ఉందన్నారు. అవినీతికి తావు లేకుండా తమ బాధ్యతలను పూర్తిస్థాయిలో నిర్వహిస్తామని స్పష్టం చేశారు. అలాగే ఎన్నికల్లో తమకు ఓటు వేసి గెలిపించిన పారిశ్రామికవేత్తలు అందరికీ వారు కృతజ్ఞతలు తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో ఐలా వైస్ చైర్మన్ తాటి శ్రీనివాస్, కార్యదర్శి జి రాఘవయ్య, సంయుక్త కార్యదర్శి పి సురేష్, కోశాధికారి ఈ మల్లికార్జున రెడ్డి, సిఐఏ ఉపాధ్యక్షుడు వై సుధాకర్ రెడ్డి, కార్యదర్శి పి ఎస్ మోహన్, సంయుక్త కార్యదర్శి జి గంగాధర బాబు, కోశాధికారి శ్రీరామ్ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.