ముద్ర ప్రతినిధి, పెద్దపల్లి: సమాజ సేవలో యువత ముందు ఉండాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష పిలుపునిచ్చారు. గురువారం కలెక్టరేట్ లో బోస్ ఫెలోషిప్ వాలంటీర్లు చేపట్టిన యంగ్ ఓరిటర్ ప్రోగ్రాం ముగింపు కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ప్రతి విద్యార్థికి కనీస అభ్యసన సామర్ధ్యాలు అందించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందన్నారు. సామాజిక ఆర్థిక కారణాల కారణంగా గ్రామీణ ప్రాంతాల్లో కొంతమేర తల్లిదండ్రులు పిల్లల చదువులపై అధికంగా శ్రద్ధ పెట్టలేక పోవచ్చని, ఈ కారణంగా విద్యార్థులు వెనుకంజలో ఉండకుండా సంబంధిత గ్రామాల యువత ముందుకు వచ్చి ఆ విద్యార్థులకు మెరుగైన విద్య అందేందుకు స్వచ్ఛందంగా పనిచేయాలని కలెక్టర్ తెలిపారు. బోస్ ఫెలోషిప్ కార్యక్రమం క్రింద 8 నెలల నుంచి వాలంటీర్లుగా పనిచేస్తున్న డిగ్రీ కళాశాల విద్యార్థులు జిల్లాలో ఎంపిక చేసిన 30 ప్రభుత్వ పాఠశాలల్లోని ప్రాథమిక తరగతి విద్యార్థులకు వివిధ ఆక్టివిటీస్ ద్వారా విద్యాబోధన చేయడం కలెక్టర్ అభినందించారు. యంగ్ ఓరెటర్ అనే కార్యక్రమానికి ప్రారంభించి ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు ఆంగ్లం మాట్లాడేందుకు వారికి ఇంగ్లీష్ స్కిన్ అభివృద్ధి చేసేందుకు వాలంటీర్లు కృషి చేయడం ప్రశంసనీయమని అన్నారు. వాలంటీర్ల శిక్షణలో ప్రాథమిక తరగతి విద్యార్థులు ఆంగ్ల భాషలో మంచి ప్రదర్శన కనబరిచారని కలెక్టర్ తెలిపారు. డిగ్రీ చదివే విద్యార్థులు నాయకత్వ లక్షణాలను పెంచుకొని దేశానికి ఉపయోగపడే కార్యక్రమాలను కొనసాగించాలని కలెక్టర్ సూచించారు. యువత వారి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు కనీస అభ్యాసన సామర్థ్యాలు కల్పించేందుకు తమ వంతు సహకారం అందించాలని కోరారు. సమాజానికి మంచి చేసే కార్యక్రమాలను చేపట్టే యువతకు జిల్లా యంత్రాంగం తరుపున సంపూర్ణ సహకారం ఎల్లప్పుడూ అందించడానికి ముందు ఉంటామని కలెక్టర్ తెలిపారు. యువత మంచి మార్గంలో నడుస్తూ గొప్ప విజయాలు సాధించాలని, సమాజ శ్రేయస్సు కొరకు మరింత ఉన్నతమైన కార్యక్రమాలను నిర్వహించాలని కలెక్టర్ ఆకాంక్షించారు. ఈ ముగింపు కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులు, ప్రాథమిక తరగతి పిల్లలు నిర్వహించిన వివిధ నృత్య ప్రదర్శనలు వీక్షకులను అలరించాయి. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి డి. మాధవి, ఏం.ఎం.ఓ డాక్టర్ పీఎం షేక్, యంగ్ ఓరెటర్ విద్యార్థిని విద్యార్థులు, బోస్ ఫెలోషిప్ వాలంటీర్లు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.