ముద్ర,గద్వాల:
ఉన్నత విద్యలో బాలికలను ప్రోత్సహించడానికి అజీమ్ ప్రేమ్‌జీ ఫౌండేషన్ ప్రత్యేక స్కాలర్‌షిప్ పథకాన్ని ప్రారంభించిందని ప్రియదర్శిని ప్రభుత్వ మహిళ డిగ్రీకళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఏ. మీనాక్షి అన్నారు. 2025-2026 సంవత్సరానికి అజీజ్ ప్రేమ్ జీ స్కాలర్ షిప్ కు దరఖాస్తు చేసుకున్న 11 మంది విద్యార్థినిలకు స్కాలర్ షిప్ లు మంజూరయిన సందర్భంగా గురువారం కళాశాల ప్రిన్సిపల్ విద్యార్థనిలను అభినందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నైపుణ్యం కలిగిన యువతీ,యువకులు చదువుకోవడానికి ఆర్థిక ఇబ్బందులు లేకుండా చేయాలనే ఉద్దేశంతో ప్రతీ సంవత్సరం 15 వేల మందికి అజీం ప్రేమ్ జీ ఫౌండేషన్ స్కాలర్షిప్ ద్వారా ఆర్థిక సహాయం అందిస్తోంది అని అన్నారు. ఆర్థిక సమస్యల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న మహిళా విద్యార్థులకు, ఉన్నత విద్యను అభ్యసించడానికి ఈ స్కాలర్షిప్ ఎంతగానో తోడ్పడుతుంది అని పేర్కొన్నారు. అజీజ్ ప్రేమ్ జీ ట్రస్టు ప్రతీ సంవత్సరం 15 వేల మందికి 5.30,000 స్కాలర్షిప్ను అందిస్తోందని, ముఖ్యంగా, ఆర్థికంగా వెనుకబడిన మహిళా విద్యార్థినులకు ఉన్నత విద్యను ప్రోత్సహించాలనే లక్ష్యంతో ఈ పథకాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. ఈ స్కాలర్షిప్ కోసం కళాశాల నుండి మొత్తం 25 మంది విద్యార్థినిలు దరఖాస్తు చేసుకోగా, 11 మంది విద్యార్థినిలు ఎంపికయ్యారు అని అందులో మొదటి విడతలో ఒక్కో విద్యార్థినికి రూ.30,000 స్కాలర్ షిప్ మంజూరు చేయడం జరిగిందన్నారు. నిరుపేద కుటుంబాలకు చెందిన బాలికలు ఉన్నత విద్యను అభ్యసించుకోవడానికి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. ఇది విద్యార్థుల భవిష్యత్తుకు మాత్రమే కాకుండా, సమాజ అభివృద్ధికి కూడా దోహదపడుతుందని పేర్కొన్నారు.
ఐక్యూఏసి కోఆర్డినేటర్ ఎం. దేవుజా మాట్లాడుతూ, విద్యార్థినులు స్కాలర్షిప్ అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం ఎంతో ముఖ్యమని, కళాశాల తరఫున అవసరమైన మార్గదర్శకత్వం అందిస్తామని తెలిపారు.