గోదావరి పుష్కరాలకు విస్తృత ఏర్పాట్లు
రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంత రావు
ముద్ర ప్రతినిధి, నిర్మల్:
చదువుల తల్లి శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారు కొలువైన బాసర శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయాన్ని రూ. 225 కోట్లతో ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దనున్నట్లు రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు స్పష్టం చేశారు. అలాగే రానున్న గోదావరి పుష్కరాల సందర్భంగా విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేయనున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు, జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా లు బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయ మాస్టర్ ప్లాన్ అమలు గురించి ఆదివారం పర్యటించారు. ఆలయ ప్రాంగణం, మహాలక్ష్మి అమ్మవారి ఆలయం, వ్యాస గుహ తదితర ప్రాంతాలు తిరిగి చూశారు. మాస్టర్ ప్లాన్ అమలు గురించి కీలక అంశాలు చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాసర మాస్టర్ ప్లాన్ అమలుతో ఆలయ రూపురేఖలు మారనున్నా యన్నారు. బాసర క్షేత్రం ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చెందుతుందన్నారు. ఆగమ శాస్త్ర నియమాల ప్రకారం భక్తుల విశ్వాసాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపడతామని తెలిపారు. అమ్మవారి దర్శనం కోసం దేశ నలుమూలల నుంచి వచ్చే భక్తులకు అన్ని వసతులు కల్పిస్తామని పేర్కొన్నారు. కలెక్టర్ భవేశ్ మిశ్రా మాట్లాడుతూ బాసర ఆలయ అభివృద్ధి కొరకు ఇటీవలి రాష్ట్ర ముఖ్యమంత్రి శంకుస్థాపనలు చేశారని చెప్పారు. మాస్టర్ ప్లాన్ అమలు ద్వారా ఆలయం అభివృద్ధి చెందనుందని పేర్కొన్నారు. రానున్న గోదావరి పుష్కరాలకు తగిన ఏర్పాట్లు చేస్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో భైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, ఎఎస్పీ సాయికిరణ్, ఆలయ ఈవో అంజనా దేవి, తహసిల్దార్ పవన్ చంద్ర, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు