ముద్ర ప్రతినిధి, నిర్మల్:
ఎన్నికల తేదీలు సమీపిస్తుండడంతో ప్రధాన పార్టీలు తమ ప్రచారాన్ని మరింత ముమ్మరం చేశాయి. వార్డుల వారిగా ఇంటింటి ప్రచారంతోపాటు కార్నర్ మీటింగ్ లు కూడా కొనసాగిస్తూ తమ విజయ అవకాశాలను మెరుగుపరుచుకునేందుకు యత్నిస్తున్నారు. ప్రధానంగా బిజెపి, కాంగ్రెస్ పార్టీలు బిఆర్ఎస్ తో పోలిస్తే ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. బిజెఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ప్రచారంలో పట్టణమంతా కలియ తిరుగుతూ, సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలు అరికట్టాలంటే బిజెపికి పట్టం కట్టాల్సిన అవసరం ఉందని చెబుతూ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. ఇదిలా ఉంటే కాంగ్రెస్ పక్షాన నియోజకవర్గ ఇన్చార్జ్ కూచాడి శ్రీహరి రావు, మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, మాజీ కేంద్రమంత్రి సముద్రాల వేణుగోపాల చారి ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. అధికార పార్టీ గెలిస్తేనే అభివృద్ధి సాధ్యపడుతుందని వారు వివరిస్తూ ముందుకు సాగుతున్నారు. కాగా బిఆర్ఎస్ పక్షాన బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ప్రచారాన్ని కొనసాగిస్తూ ముందుకు సాగుతున్నారు వీరి కృషి ఎంత మేరకు ఫలిస్తుందన్న చర్చ సర్వత్రా జరుగుతోంది.
