Take a fresh look at your lifestyle.

బిజెవైయం ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతిపత్రం అందజేత

 

ముద్ర ప్రతినిధి, నిర్మల్:
వరిధాన్యం, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల్లో నెలకొన్న తీవ్ర జాప్యం, మౌలిక వసతుల లేమి, తరుగు తేమ పేరుతో జరుగుతున్న దోపిడిని అరికట్టి యుద్ధ ప్రాతిపదికన కొనుగోలు చేపట్టాలని కోరుతూ నిర్మల్ జిల్లా బీజేవైఎం అధ్యక్షులు ఒడిసెల అర్జున్ ఆధ్వర్యంలో కలెక్టర్ భవేశ్ మిశ్రాకు వినతి పత్రాన్ని మంగళవారం సమర్పించారు.
కొనుగోలు కేంద్రాల్లో మౌలిక వసతుల కల్పన, గన్ని బ్యాగుల కొరత, హమాలీలు లారీలు సకాలంలో అందుబాటులో లేకపోవడంతో కొనుగోలు ప్రక్రియ పూర్తిగా పడకేసిందని ఆ వినతి పత్రంలో పేర్కొన్నారు. తరుగు, తేమ పేరుతో దళారులు దోపిడీ చేస్తున్నారని, రైతు చెమటను తేమ పేరుతో కొలిచే ఈ దోపిడిని తక్షణమే అరి కట్టాలని కోరారు. కొనుగోళ్లు చేయడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని దీంతో రైతులు ఆవేదన చెందుతున్నారని పత్రంలో పేర్కొన్నారు. వినతిపత్రంపై స్పందించిన కలెక్టర్ భవేష్ మిశ్రా ఈనెలాఖరు లోగా కొనుగోలు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు మేడిసెమ్మె రాజు, మహిళా నాయకురాలు అలివేలు మంగ, బీజేపీ జిల్లా మీడియా కన్వీనర్ బుర్ర రమేష్, నిర్మల్ పట్టణ అధ్యక్షులు సుంకరి సాయి బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కుమ్మరి వెంకటేష్, భరత్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.