- భూములు అమ్మి పాలించేది ఏంది?
- హెచ్ సీయూ విద్యార్థులపై అమానుషంగా వ్యవహరిస్తున్నారు.
- విద్యార్ధినులు మెడలు పట్టుకుని గుంజుకుపోయారు.
- సీఎంకు కనీసం మానవత్వం లేదు.
- తెలంగాణ సమాజం బాధ పడుతుంది.
- రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్రమంత్రి బండి సంజయ్ ఫైర్.
ముద్ర, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం కంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువగా అరాచకం చేస్తుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ధ్వజమెత్తారు. భూములు అమ్మి పాలించేది ఏంది అని ఆయన ప్రశ్నించారు. ఈ మేరకు సోమవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో బండి సంజయ్ మాట్లాడారు.. హెచ్ సీయూకు చెందిన భూములను అమ్మవద్దని విద్యార్థులు అడిగితే వారిపై అమానుషంగా వ్యవహరిస్తున్నరని ఆయన మండిపడ్డారు. భూముల వివాదంలో నిరసన తెలుపుతున్న విద్యార్థినులను మెడలు పట్టి పోలీసులు గుంజుకుపోవడం దారుణమన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి కనీసం మానవత్వం లేదని, తెలంగాణ సమాజం బాధ పడుతుందన్నారు. ఈనెల గడవాలంటే హెచ్ సీయూ భూములు అమ్మాలని, ఆ భూములను అమ్మకుంటే ప్రభుత్వ పాలన సాగదని ఆయన విమర్శించారు. ఇలాగైతే రాబోయే తరాలకు గజం భూమి కూడా మిగలదన్నారు. భూములమ్మి వీళ్ళు పాలించేది ఏందని, కేఏ పాల్ కూడా పరిపాలన చేస్తాడని ఆయన ఎద్దేవా చేశారు. భూముల వేలం వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాడ్ చేశారు. అర్బన్ నక్సలైట్లను తీసుకొచ్చి విద్యా కమిషన్ వేశారని , మరి ఇప్పుడు వారు ఎటుపోయారని , కమ్యూనిస్టు భావజాలం ఉన్న వ్యక్తులు నోరు ఎందుకు మెదపడం లేదని బండి సంజయ్ నిలదీశారు. కేంద్రం పైసలతో రాష్ట్ర పాలకులు పోజులు కొడుతున్నారని ఆయన విమర్శించారు. 5 కిలోల బియ్యం కేంద్రం ఇస్తుందా? రాష్ట్రం ఇస్తుందా స్పష్టం చేయాలని, అలాగే రూ.10 వేల కోట్లు కేంద్రం ఇస్తుందా? లేదా చెప్పాలని డిమాండ్ చేశారు. అదనంగా పది రూపాయలు ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం హంగు ఆర్భాటాలు చేస్తుందని విమర్శించారు. రేషన్ షాపులకు వెళ్లి బియ్యాన్ని తనిఖీ చేయాలని బీజేపీ కార్యకర్తలను కోరారు. ప్రతి కిలోకి 40 రూపాయలు కేంద్రం ఇస్తుందని చెప్పాలన్నారు. మోడీ పోటో ఎందుకు పెట్టరు? అని ప్రశ్నించారు. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో 3 పార్టీలు ఒకటి అయ్యాయని దుయ్యబట్టారు. ఎంఐఎం, బీఆర్ఎస్, కాంగ్రెస్ లు ఒకటే అని ఆరోపించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్‌కు ఓట్లు ఉన్న పోటీ చేయడం లేదని, ఎంఐఎంను గెలిపించే ప్రయత్నం చేస్తున్నాయన్నారు. గ్రూప్ వన్ అభ్యర్థుల అభ్యంతరాలు పరిగణన లోకి తీసుకోవాలని, ఎవరికి అన్యాయం జరగకుండా చూడాలని డిమాండ్ చేశారు.