– సైబరాబాద్ పోలీసుల ప్రత్యేక కార్యాచరణ
– ప్రజల వద్దకే పోలీసులు
ముద్ర, శేరిలింగంపల్లి :
విజిబుల్ పోలీసింగ్‌లో భాగంగా సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఫుట్ పెట్రోలింగ్‌ను మరింత బలోపేతం చేసే దిశగా పోలీసులు వినూత్న కార్యాచరణ చేపట్టారు. కేవలం పెట్రోలింగ్ వాహనాల గస్తీకే పరిమితం కాకుండా, ప్రజల మధ్యకు నేరుగా నడుచుకుంటూ వెళ్తూ ‘మేమున్నం’ అనే భరోసా కల్పించే విధంగా ఈ కొత్త విధానానికి శ్రీకారం చుట్టారు. ప్యాట్రోల్ కార్లు, బ్లూ కోల్ట్ సిబ్బంది తమ వాహనాలను నిలిపివేసి, నిత్యం ప్రజలతో మమేకమవుతూ జనసంచారం అధికంగా ఉండే ప్రధాన రహదారులు, మార్కెట్ ప్రాంతాలు, బస్టాండ్‌లు, నివాస కాలనీలు, చిన్న చిన్న వీధుల్లో పోలీసులు కాలినడకన పర్యటిస్తూ క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలిస్తున్నారు. ప్రజలతో నేరుగా మాట్లాడి అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ, అనుమానాస్పద వ్యక్తులు లేదా కదలికలు గమనించినప్పుడు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరుతున్నారు.
ప్రజల్లో భద్రతా భావనను పెంపొందించడం, అనుమానాస్పద వ్యక్తుల కదలికలను గుర్తించడం, అనుమానితులను తనిఖీ చేయడమే లక్ష్యంగా ఈ ఫుట్ పెట్రోలింగ్‌ను పోలీసులు సమర్థవంతంగా అమలు చేస్తున్నారు. దీనివల్ల రాత్రి వేళల్లో సామాన్య ప్రజల్లో ధైర్యం పెరగడమే కాకుండా, నేరస్థుల్లో భయం కలుగుతోంది. క్షేత్రస్థాయిలో స్థానికులతో నేరుగా సంభాషించడం ద్వారా కమ్యూనిటీ పోలీసింగ్‌ను బలోపేతం చేస్తూ, నేర నియంత్రణకు పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ప్రజల రక్షణే ధ్యేయంగా ఈ ఫుట్ పెట్రోలింగ్ నిరంతరం కొనసాగుతుందని అధికారులు తెలిపారు.

ఫుట్ ప్యాట్రోలింగ్ ప్రయోజనాలు..
క్షేత్రస్థాయి పర్యవేక్షణ: బ్లూ కోల్ట్స్, పెట్రోలింగ్ సిబ్బంది వాహనాలను పక్కన పెట్టి, మార్కెట్లు, బస్టాండ్‌లు మరియు నివాస ప్రాంతాల్లో కాలినడకన పర్యటిస్తున్నారు.
నేరాల కట్టడి: వాహనాలు వెళ్లలేని ఇరుకైన సందుల్లో కూడా పోలీసులు తిరగడం వల్ల అసాంఘిక కార్యకలాపాలకు చెక్ పడుతోంది.
ప్రజలతో మమేకం: రాత్రి వేళల్లో పనిచేసే కార్మికులు, వ్యాపారులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు.
అప్రమత్తత : అనుమానాస్పద కదలికలు ఉంటే వెంటనే డయల్ 100 లేదా స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.
అనుమానితుల వివరాల సేకరణ – రాత్రి వేళల్లో కారణం లేకుండా తిరిగే వారు, పాత నేరస్థుల వివరాల సేకరిస్తారు. నిర్మానుష్య ప్రాంతాలలో మద్యం సేవించే వారి కట్టడి, అసాంఘిక కార్యకలాపాల కట్టడి.
వాహన తనిఖీలు – నంబర్ ప్లేట్ సరిగ్గా లేని, అనుమానాస్పదంగా ఉన్న వాహనాలు తనిఖీ చేస్తారు.
శారీరక చురుకుదనం: నిరంతరం నడవడం వల్ల పోలీసు సిబ్బందిలో శారీరక దారుఢ్యం పెరుగుతుంది.
పటిష్టమైన నిఘా: వాహనాల్లో వెళ్లేటప్పుడు గమనించలేని చిన్న చిన్న విషయాలను (ఉదాహరణకు: ఇంటి తాళం సరిగ్గా లేకపోవడం, గోడల చాటున వ్యక్తులు దాక్కోవడం) నడుస్తున్నప్పుడు సులభంగా గుర్తించవచ్చు.
ప్రజల్లో విశ్వాసం: ప్రజల మధ్య ఉండటం వల్ల పోలీసులపై ప్రజల్లో భరోసా భావం పెరుగుతుంది.
ముందస్తు సమాచారం : స్థానికులతో స్నేహపూర్వకంగా ఉండడం వల్ల ఒక్కోసారి నేరాలకు సంబంధించిన ముందస్తు సమాచారం తెలుసుకునే వీలుంది.
మొత్తంగా కాలినడక గస్తీ వల్ల ప్రజలతో నేరుగా మాట్లాడే అవకాశం లభించడం ద్వారా పోలీసులకు స్థానిక పరిస్థితులపై స్పష్టమైన అవగాహన ఏర్పడుతోందని పోలీసులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలతో సన్నిహిత సంబంధాలు ఏర్పడటం వల్ల ముఖ్య సమాచారం త్వరగా అందుకునే వీలుందన్నారు.
ప్రజల భద్రత కేవలం పోలీసుల బాధ్యతే కాదు, పౌరుల సహకారం కూడా అంతే ముఖ్యం. మీ పరిసరాల్లో ఏవైనా అనుమానాస్పద పరిస్థితులు కనిపిస్తే వెనుకాడకుండా పోలీసులకు సమాచారం అందించండి.
దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో రాత్రి సమయాల్లో పోలీసులు నిర్వహిస్తున్న ఈ ఫుట్ ప్యాట్రోలింగ్ సరికొత్త ఒరవడిని సృష్టించింది.
దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో రాత్రి సమయాల్లో పోలీసులు నిర్వహిస్తున్న ఈ ఫుట్ ప్యాట్రోలింగ్ సరికొత్త ఒరవడిని సృష్టించింది.
దుండిగల్ ఇన్‌స్పెక్టర్ పి. సతీష్

వాహనాల్లో వెళ్లేటప్పుడు కేవలం పైపైన మాత్రమే చూడగలం, కానీ నడిచినప్పుడు క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులను స్వయంగా గమనించే వీలుంది. తద్వారా ప్రజల్లో పోలీసులపై నమ్మకం పెరుగుతుంది. నేరాలకు ముందుగానే అడ్డుకట్ట వేయడం, ప్రజల్లో నమ్మకాన్ని పెంపొందించడం కోసం కాలినడక గస్తీని నిరంతరం కొనసాగిస్తామన్నారు.
రామ్మోహన్, దుండిగల్ ఎస్ఐ (సంతృప్తిని ఇస్తుంది):*
“కేవలం నేరగాళ్లను పట్టుకోవడమే కాకుండా, సామాన్య ప్రజలకు రక్షణగా నిలుస్తున్నామనే భావన మాకు వృత్తిపరమైన సంతృప్తిని ఇస్తుంది. ప్రజల మధ్య తిరగడం వల్ల ఎవరైనా అనుమానిత వ్యక్తులు కనిపిస్తే వారు వెంటనే మాకు సమాచారం ఇస్తున్నారు. ఇది నేరాలు నివారణకు ప్రివెంటివ్ పోలిసింగ్ కు ఉపకరిస్తుంది.
ఎస్. రాజు, పిసి (అప్రమత్తత పెరిగింది):

ఇలా రోజుకు కొన్ని కిలోమీటర్లు నడవడం వల్ల రాత్రిపూట వచ్చే నిద్రమత్తు వదిలిపోయి, అప్రమత్తత పెరిగింది.
కె. సాయి కుమార్, పిసి (360°ల నిఘా):*

ఫుట్ ప్యాట్రోలింగ్ వల్ల వాహనాలు వెళ్లలేని సందుల మధ్యలోకి కూడా మేము వెళ్లగలుగుతున్నాం. ఇళ్ల తాళాలు సరిగ్గా ఉన్నాయా? ఎవరైనా గోడల చాటున దాక్కున్నారా? వంటి సూక్ష్మ విషయాలను గమనించే అవకాశం ఉంది. కాలినడక గస్తీ నిర్వహించడం వల్ల ప్రతి వీధి, మూలను దగ్గరగా పరిశీలించే అవకాశం లభిస్తుంది. వాహనాల్లో తిరిగే గస్తీతో పోలిస్తే కాలినడక గస్తీ ద్వారా అనుమానాస్పద కదలికలను త్వరగా గుర్తించగలుగుతున్నాము. దీంతో నేరాలను ముందుగానే అరికట్టే అవకాశం ఉంది.
వై. చిరంజీవి, పిసి (ప్రజలతో నేరుగా సంభాషణ):

“మేము నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ప్రజలు మాతో చొరవగా మాట్లాడుతున్నారు. టీ దుకాణాల వద్ద, రాత్రి కాపలాదారుల వద్ద ఆగి మాట్లాడటం వల్ల వారి సమస్యలు మా దృష్టికి వస్తున్నాయి.