Take a fresh look at your lifestyle.

మొక్కజొన్న కొనుగోళ్లలో అలసత్వం రైతుల ఆందోళన ముందు జాగ్రత్త చర్యలు విఫలం ఆగ్రహిస్తున్న అన్నదాతలు

 

ముద్ర ప్రతినిధి, నాగర్‌కర్నూల్:

నాగర్‌కర్నూల్ మార్కెట్ యార్డులో మొక్కజొన్న కొనుగోళ్లు మందగమనంలో సాగుతుండటంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత 15 రోజుల క్రితం యార్డులో సుమారు 1.10 లక్షల బస్తాల పైగా మొక్కజొన్న నిల్వ ఉండగా, ప్రస్తుతం అవి 70 వేల బస్తాలకు పైగా తగ్గినట్లు సమాచారం. అయినప్పటికీ ప్రతిరోజూ కేవలం రెండు నుంచి మూడు లారీలు మాత్రమే తరలింపునకు రావడంతో సమస్య పూర్తిగా పరిష్కారం కాలేదు. మరోవైపు రోజుకు దాదాపు 10 వేల బస్తాల కొత్త దిగుబడి మార్కెట్‌కు చేరుతుండటంతో నిల్వలు తగ్గడం లేదు.

రైతుల సమస్యలపై టీఆర్‌ఎస్‌, సీపీఎం, సీపీఐ, బిఎస్పీ, బీజేపీ తదితర ప్రతిపక్ష పార్టీలు మార్కెట్ యార్డును సందర్శించి ఆందోళనలు చేపట్టాయి. రైతుల ఇబ్బందులను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా, వారం రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. అనంతరం జిల్లా కలెక్టర్ అధికారులతో వరుస సమావేశాలు నిర్వహించి చర్యలు చేపట్టారు.

ఇటీవల స్థానిక ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి, ఎంపీ డా. మల్లు రవి, జిల్లా కలెక్టర్ కలిసి మార్కెట్ యార్డును సందర్శించారు. వారు వచ్చిన రోజే 14 లారీలను ఏర్పాటు చేసి మొక్కజొన్న తరలింపును వేగవంతం చేశారు. దీంతో సుమారు 60 వేల బస్తాలను త్వరితగతిన తరలించినట్లు సమాచారం.

అయితే ఒకవైపు తరలింపులు కొనసాగుతుండగానే మరోవైపు భారీగా కొత్త పంట మార్కెట్‌కు చేరుతోంది. దీంతో నాగర్‌కర్నూల్–వనపర్తి మధ్య ఉన్న సహకార సంఘం గోదాములకు కూడా మొక్కజొన్నను తరలిస్తున్నారు. అక్కడ దాదాపు 30 వేల బస్తాలను నిల్వ చేసినట్లు తెలిసింది.

అధిక దిగుబడి వచ్చినప్పటికీ సరైన కొనుగోలు వ్యవస్థ లేక రైతులకు న్యాయం జరగడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గన్నీ బ్యాగులు, లారీలు, రవాణా సౌకర్యాలు సమృద్ధిగా కల్పించి, పీఏసీఎస్‌, మార్క్‌ఫెడ్‌ ద్వారా వేగంగా కొనుగోళ్లు చేపట్టి రైతులకు న్యాయం చేయాలని ప్రభుత్వం, ప్రజాప్రతినిధులను రైతులు కోరుతున్నారు.

Leave A Reply

Your email address will not be published.