ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్:
ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థులకు నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆర్ట్స్ & కామర్స్ డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో నెలరోజుల ఉచిత ఇంటర్న్‌షిప్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డా. కె. గీతాంజలి తెలిపారు.
విద్యార్థులలో వృత్తి నైపుణ్యాలు, కమ్యూనికేషన్ సామర్థ్యాలు, వ్యక్తిత్వ వికాసం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన పెంపొందించేందుకు ఈ ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని రూపొందించినట్లు పేర్కొన్నారు.
ఈ ఇంటర్న్‌షిప్‌లో కమ్యూనికేషన్ స్కిల్స్, కృత్రిమ మేధస్సు (AI) సహాయంతో ఎంఎస్-ఆఫీస్ బేసిక్స్, వ్యక్తిత్వ వికాసం, తెలుగు, ఉర్దూ, ఇంగ్లీష్ భాషలు మరియు సాహిత్యంపై శిక్షణ అందించబడుతుంది. ఇటీవల లేదా గత సంవత్సరం ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థులు ఈ కార్యక్రమానికి అర్హులని తెలిపారు.
శిక్షణా కార్యక్రమం ఏప్రిల్ 1 నుండి ఏప్రిల్ 30 వరకు ప్రతిరోజూ ఉదయం 11.00 గంటల నుండి మధ్యాహ్నం 1.00 గంటల వరకు శ్రీపురం రోడ్‌లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల (ఆర్ట్స్ & కామర్స్)లో నిర్వహించబడుతుంది.
ఆసక్తి గల విద్యార్థులు కళాశాలను సంప్రదించి ముందస్తుగా తమ పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. పరిమిత సీట్లు మాత్రమే అందుబాటులో ఉన్నందున త్వరగా నమోదు చేసుకోవాలని తెలిపారు.
ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులు భవిష్యత్తులో ఉపాధి అవకాశాలకు సిద్ధమవడంతో పాటు తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకునే అవకాశం లభిస్తుందని ప్రిన్సిపాల్ గీతాంజలి అన్నారు.
మరిన్ని వివరాలకు 6302057411, 81792 26268 నంబర్లను సంప్రదించాలని సూచించారు.