Take a fresh look at your lifestyle.

ఇకపై “కొప్పుల” డైరెక్షన్ లోనే టీబీజీకేఎస్ కార్యకలాపాలు

యైటింక్లయిన్ కాలని, ముద్ర: తెలంగాణ భవన్‌ లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌ తో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ప్రతినిధుల సమావేశంలో చర్చించిన అంశాలు, తీసుకున్న నిర్ణయాలను, సంఘం రామగుండం రెండవ ఏరియా ఉపాధ్యక్షులు ఐలి శ్రీనివాస్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం కొరకు, పార్టీ పక్షాన ఇన్‌ఛార్జీగా, సంఘం వ్యవస్థాపక సభ్యులు, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ వ్యవహరిస్తారని, ఆయన
ఆధ్వర్యంలో కార్మిక సంఘం కార్యకలాపాలను ముందుకు తీసుకెళ్లాలని, అలాగే సింగరేణి సమస్యలపై పెద్దఎత్తున పోరాటాలు చేపట్టాలని నిర్ణయించడం జరిగిందని తెలిపారు. సింగరేణి కార్మికులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసేదాకా ప్రభుత్వంపై ప్రజాక్షేత్రంతో పాటు, ఇతర రూపాల్లో ఒత్తిడి తీసుకురావాలని, పది సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సింగరేణి కార్మికుల కొరకు, సింగరేణి సంస్థ కొరకు చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను విస్తృతంగా కార్మికుల్లోకి తీసుకెళ్లాలని కేటీఆర్ సూచించినట్లు పేర్కొన్నారు. పది సంవత్సరాల కాలంలో సింగరేణితో పాటు ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడాలన్న ఏకైక లక్ష్యంతో కేసీఆర్ పనిచేశారని, కేవలం రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకోవడం మాత్రమే కాకుండా, దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణలను బిఆర్ఎస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకించిందనీ ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలకు అడ్డగోలుగా అమలు చేయడానికి వీలుకాని హామీలు ఇచ్చిన తీరుగానే, సింగరేణికి కూడా మోసం చేసిందని, ఈ అంశాలను కార్మికుల దృష్టికి తీసుకువెళ్లాలని కేటీఆర్ సూచించినట్లు ఆయన తెలిపారు. సింగరేణి గనుల ప్రైవేటీకరణ కొరకు బీజేపీతో కలిసి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కుట్రలపై గళమెత్తాలని, బొగ్గు గని కార్మిక సంఘానికి పార్టీ పూర్తిస్థాయిలో మద్దతు, సహకారం అందిస్తుంది. కార్మికులకు ఎలాంటి కష్టం వచ్చినా అండగా నిలబడుతుందని, కార్మికుల కొరకు పార్టీ లీగల్ సెల్ కూడా పూర్తిస్థాయి అండగా ఉంటుందని, ఏ కార్మికునికి కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయం చేసినా.. చట్టబద్ధంగా ఎదుర్కొనేందుకు పార్టీ లీగల్ సెల్ సహకారం అందిస్తుందని కేటీఆర్ హామీ ఇచ్చినట్లు ఆయన తెలిపారు. ఇక త్వరలోనే సింగరేణి ప్రాంతంలో బొగ్గు గని కార్మిక సంఘం ఆధ్వర్యంలో విస్తృతస్థాయి సమావేశం ఉంటుందని కేటీఆర్ తెలియజేసినట్లు ఆయన తెలిపారు. ఇంకా ఈ సమావేశంలో సంఘం నాయకులు మిర్యాల రాజిరెడ్డి, మదాసు రామ్మూర్తి, కాపు కృష్ణ, సురేందర్ రెడ్డి, నూనె కొమరయ్య, పార్లపల్లి రవి, వడ్డేపల్లి శంకర్, నాగెలి సాంబయ్య, మేడిపల్లి సంపత్, బండి రమేష్, బడితెల సమ్మయ్య, నాగేల్లి వెంకటేష్, గడప రాజయ్య, తుమ్మ శ్రీనివాస్, జాఫర్, మహమ్మద్ పాల్గొన్నట్లు ఐలి శ్రీనివాస్ ఆ ప్రకటనలో వివరించారు.

Leave A Reply

Your email address will not be published.