ముద్ర, కోరుట్ల;
కోరుట్ల పట్టణంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శతజయంతి ఉత్సవాల సందర్భంగా గురువారం రోజు ఏకలవ్య బస్తీ ఆధ్వర్యంలో హిందూ సమ్మేళనం కార్యక్రమాన్ని పురస్కరించుకుని మహిళల ఆధ్వర్యంలో నిర్వహించిన బైక్ ర్యాలీ విశేష ఆకర్షణగా నిలిచింది. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా అశేష మహిళామణులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ ధర్మభక్తిని చాటారు. ఆకాశం మేఘావృతమై వర్షపు జల్లులు కురుస్తున్నప్పటికీ మహిళలు ఉత్సాహంగా ర్యాలీలో పాల్గొనడం అందరినీ ఆకట్టుకుంది.
చినుకులు పడుతున్నా అడుగులు ఆగకుండా, వర్షం కురుస్తున్నా జెండాలు వాలకుండా మహిళలు ధర్మనినాదాలతో ముందుకు సాగడం కార్యక్రమానికి ప్రత్యేక శోభను తీసుకొచ్చింది. మహిళల సంఘటిత భావం, ధైర్యం, భక్తి ప్రతి ఒక్కరినీ భావోద్వేగానికి గురిచేసింది.
ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ, తొమ్మిదవ తేదీన సాయంత్రం అష్టలక్ష్మి దేవాలయంలో జరిగే హిందూ సమ్మేళనం కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రతి హిందూ కుటుంబం పాల్గొనాలని పిలుపునిచ్చారు. ధర్మ పరిరక్షణలో మహిళల పాత్ర ఎంతో గొప్పదని, ఈ ర్యాలీ దానికి ప్రత్యక్ష నిదర్శనమని పేర్కొన్నారు. ధర్మం కోసం ముందుకు వచ్చిన ప్రతి తల్లికి, ప్రతి సోదరీమణికి నిర్వాహకులు హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. కార్యక్రమంలో రాష్ట్ర మహిళా ఐ ఎం ఏ మహిళా విభాగ్ అధ్యక్షురాలు డాక్టర్ స్వీథీ అనుప్, డా. అనురాధ, డా. భోగ శ్రీలత, మాజీ మున్సిపల్ చైర్మన్ అంబాల మాధవి, పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు.