Take a fresh look at your lifestyle.

‘హంగా’మా……..హంగ్ పుర పీఠాల్లో కొలిక్కిరాని ఛైర్మన్ ఎన్నిక

క్యాతనపల్లిలో బీఆర్ఎస్, సీపీఐల బంద్
చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్ట్
ఉద్రిక్తతకు నడుమ కోర్టుకు, 14 రోజుల రిమాండ్
ఇబ్రహీంపట్నం ఎన్నికకు హైకోర్టు లైన్ క్లియర్
ఎన్నికపై కలెక్టర్ దే తుది నిర్ణయమని వ్యాఖ్య
ఖానాపూర్ లో బీఆర్ఎస్ కు మద్దతు ఇచ్చిన బీజేపీ
చైర్మన్ కాలపరిమితిని చెరిసగం పంపకాలు

ముద్ర, తెలంగాణ బ్యూరో :

మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక మూడో రోజూ ఉద్రిక్తతకు దారి తీసింది. ఈ నెల 16న ఛైర్మన్ ఎన్నిక సందర్భంగా తలెత్తిన ఉద్రిక్తతలు ఇంకా చల్లారలేదు. ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నికను మంత్రి వివేక్ వెంకటస్వామి అడ్డుకున్నారని ఆరోపిస్తూ.. బుధవారం క్యాతనపల్లి బంద్‌కు బీఆర్ఎస్, సీపీఐ పార్టీలు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలోనే మరోసారి పరిస్థితులు తీవ్రంగా మారాయి. మంగళవారం రోజున మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎంపీ గడ్డం వంశీలను అడ్డుకుని, వారి కాన్వాయ్‌పై దాడితో పాటు పోలీసులపై దౌర్జన్యం చేశారని, విధులను అడ్డుకున్నారని మంగళవారం బాల్క సుమన్‌పై శ్రీరాంపుర్‌ పోలీసుస్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ కేసు ఆధారంగా పోలీసులు బాల్క సుమన్‌ను పోలీసులు అరెస్ట్ చేయడం.. అగ్నికి ఆజ్యం పోసినట్లయింది. తర్వాత బుధవారం సాయంత్రం మంచిర్యాల మేజిస్ట్రేట్‌ ముందు హాజరుపరచగా.. బాల్క సుమన్‌ సహా నలుగురికి కోర్టు 14 రోజుల రిమాండ్‌ విధించింది. ఈ కేసులోనే పోలీసులు అరెస్టు చేశారు. అంతకు ముందు బాల్క సుమన్ ఇంట్లోకి భారీగా వచ్చిన పోలీసులు అరెస్ట్‌ కు సహకరించాలని కోరారు. అందుకు బాల్క సుమన్ అంగీకరించకపోవడంతో బలవంతంగా అరెస్ట్ చేసి.. పోలీస్ వ్యాన్‌లో శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. బాల్క సుమన్‌‌ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు రాగా.. వారిని బీఆర్‌ఎస్ కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో అక్కడ హైడ్రామా నెలకొంది. పోలీసులకు, బీఆర్ఎస్ కార్యకర్తలకు తీవ్ర వాగ్వాదం, తోపులాట చోటు చేసుకున్నాయి. తీవ్ర ఆందోళనల మధ్య బాల్క సుమన్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు.. మెడికల్ టెస్టుల కోసం ఆస్పత్రికి తరలించారు.

కాంగ్రెస్ కార్యకర్తలే రాళ్లు విసిరారు : బాల్క సుమన్
అరెస్ట్‌కు ముందు బాల్క సుమన్ మీడియాతో మాట్లాడారు. సమాజం తలదించుకునేలా క్యాతనపల్లిలో కాంగ్రెస్ పార్టీ దౌర్జన్యాలు జరుగుతున్నాయని ఆరోపించారు. 22 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ కేవలం ఏడు వార్డులే గెలిచిందని చెప్పారు. కానీ బీఆర్ఎస్, సీపీఐ కలిసి 14 వార్డుల్లో గెలిచామని చెప్పారు. అయినప్పటికీ ఛైర్మన్ పదవి తమకు దక్కకుండా మంత్రి వివేక్‌ చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ కార్యకర్తలే రాళ్లు విసిరారని.. ఆ దాడిలో తమ పార్టీకి చెందిన మూల రాజిరెడ్డి కారు ధ్వంసమైందని తెలిపారు. పోలీసులు కొట్టి.. కాంగ్రెస్ కార్యకర్తలు రాళ్లు వేస్తే.. తమపై కేసులు నమోదు చేస్తారా అని ప్రశ్నించారు
=====
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికకు లైన్ క్లియర్ అయింది. పీఠంపై విధించిన స్టే ను హైకోర్టు బుధవారం ఎత్తివేసింది. ఎన్నికపై కలెక్టర్ దే తుది నిర్ణయం అని స్పష్టం చేసింది. ఈ నెల 17న మున్సిపల్ కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం, చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక వేళ తన తండ్రి కనిపించడం లేదని 19వ వార్డు నుంచి గెలుపొందిన కౌన్సిలర్ ఆకుల యాదగిరి కుమారుడు హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశాడు. దీంతో ఆ ఎన్నికపై హైకోర్టు స్టే విధించింది. విచారణ నిమిత్తం యాదగిరిని బుధవారం కోర్టులో హాజరుపరచాలని కోర్టు ఈ నెల 17న ప్రభుత్వాన్ని ఆదేశించింది. మరోవైపు యాదగిరి అదే రోజు కౌన్సిలర్‍గా ప్రమాణ స్వీకారం చేసి చైర్మన్ ఎన్నికలోనూ పాల్గొన్నారు. అయితే ఆలోపు ఎన్నిక నిర్వహించవద్దని హైకోర్టు నుంచి ఆదేశాలు రావడంతో ఎన్నిక పూర్తయినా ధ్రువీకరణ పత్రాలు మాత్రం ఎన్నికల అధికారి అందించలేదు.

నన్ను బలవంతంగా లాక్కెళ్లారు : యాదగిరి
కోర్టు ఆదేశాల మేరకు యాదగిరి బుధవారం కోర్టు విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా వాదనలు వినిపిస్తూ తనను మంచిరెడ్డి కిషన్ రెడ్డి, ఆయన కుమారుడు బలవంతంగా తీసుకెళ్లినట్లు యాదగిరి కోర్టుకు తెలిపారు. బపట్ల జిల్లా చీరాల తీసుకువెళ్లారని తాను బీఆర్ఎస్ తరఫున మున్సిపల్ చైర్మన్ రేస్ లో ఉన్నానని అందువల్ల తనను బౌన్సర్లను పెట్టి మానసిసికంగా, శారీరకంగా ఇబ్బందులకు గురి చేశారని కోర్టుకు వివరించాడు. ఇష్టపూర్వకంగానే ఓటింగ్ వేసినట్లు అందరికీ చెప్పాలంటూ తనను ప్రలోభపెట్టారని అందువల్ల మళ్లీ ఎన్నికను న్యాయబద్ధంగా నిర్వహించాలని కోర్టును కోరారు.యాదగిరి వాదనపై సానుకూలంగా స్పందించిన ధర్మాసనం ఎన్నికలు పూర్తయ్యే వరకు రక్షణ ఇస్తామని చెప్పింది. అయితే ఇప్పుడు మున్సిపల్ పీఠంపై లైన్ క్లియర్ కావడంతో ఏం జరగబోతోంది అనేది ఉత్కంఠగా మారింది.

ఖానాపూర్ ‘పీఠం’ బీఆర్ఎస్ పరం…
ఖానాపూర్ మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నికలో బీఆర్ఎస్ కు బీజేపీ ఓపెన్ ఆఫర్ ఇచ్చింది. చైర్మన్ పదవి మీరు తీసుకున్నా ఓకే.. మాకు ఇచ్చినా ఓకే అంటూ.. బీజేపీ నేత రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆకుల శ్రీనివాస్ ఆఫరిచ్చారు. మీకు మేము, మాకు మీరు.. ఇద్దరం కలిసి నడిస్తేనే చైర్మన్ ఎన్నికల ప్రక్రియ పూర్తవుతుందన్నారు. చైర్మన్ పదవి మీరు తీసుకుంటే మాకు వైస్ చైర్మన్, మాకు చైర్మన్ ఇస్తే.. మీరు వైస్ చైర్మన్ పదవి తీసుకోండంటూ ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పడంతో.. ఖానాపూర్ లో రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. దేనికైనా సిద్ధంగానే ఉన్నామని, బీఆర్ఎస్ ముందుకు రావడమే ఆలస్యమన్నారు. బీజేపీ ఇచ్చిన ఈ ఆఫర్ ను బీఆర్ఎస్ నేతలు అంగీకరించారు. చైర్మన్ కాలపరిమితిని చెరిసగం పంచుకుందామని భావించడంతో.. ఖానాపూర్ చైర్మన్ ఎన్నిక కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జుకు చెక్ పెట్టేందుకే బీజేపీ ఈ నిర్ణయం తీసుకుందనే చర్చ మొదలైంది.

బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌కు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది.. ఫస్ట్‌క్లాస్‌ అడిషనల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి జ్యుడిషియల్‌ రిమాండ్‌ విధించారు. మంత్రి వివేక్‌ కాన్వాయ్‌పై దాడి కేసులో బాల్క సుమన్‌కు ఆదిలాబాద్‌ జైలుకు తరలించారు. ఈ రిమాండ్ కేసు డైరీలో సంచలన విషయాలు బయటపడ్డాయి.. ఏ1గా బాల్క సుమన్ ఉండగా.. ఏ2 మూల రాజిరెడ్డి, ఏ4 దోమ కొండ అనీల్, ఏ8 మామిడి లక్ష్మి కాంత్‌లను సైతం అరెస్టు చేశారు.. గొడిసెల రాజారమేష్, ఏ5 గాజుల చంద్ర కిరణ్, ఏ6 మేడిపల్లి సంపత్, ఏ7 గోగుల రవీందర్ రెడ్డి, ఏ9 బండారి సూరిబాబు తోపాటు మరికొంతమంది పరారిలో ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. బాల్క సుమన్ పై వీటితోపాటు మొత్తం 11 కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అరెస్టు చేయకపోతే మరిన్ని నేరాలకు పాల్పడే అవకాశం ఉందని.. శాంతి భద్రతలను ఉల్లంఘించే అవకాశం ఉందని జడ్జీకి తెలిపారు. నిందితులు రాజకీయ నేపథ్యం కలిగిన వారు కాబట్టి.. సాక్ష్యాలను తారుమారు చేయోచ్చని పోలీసులు వెల్లడించారు. సాక్షులను ప్రభావితం చేయోచ్చని.. అందుకే అరెస్ట్ చేశామని అందులో రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు

Leave A Reply

Your email address will not be published.