Take a fresh look at your lifestyle.

సింగరేణి గనులపై ఆరోగ్య అవగాహన సదస్సులు

యైటింక్లయిన్ కాలనీ, ముద్ర: సింగరేణి రామగుండం రెండవ ఏరియా ఓసీపీ.3 ప్రాజెక్ట్ బేస్ వర్క్ షాప్ లో శుక్రవారం ఏరియా ఆరోగ్యశాఖ సిబ్బంది ఆరోగ్య అవగాహన సదస్సు నిర్వహించింది. వర్క్ షాప్ హెచ్ఓడి రాజశేఖర్ ఆధ్వర్యంలో ఉదయం వర్క్ షాప్ ఆవరణలో ఏర్పాటు చేసిన సదస్సు లో ఏరియా ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ పద్మావతి పాల్గొని స్తానిక కార్మికులకు ఆరోగ్య అవగాహన కల్పిస్తూ.. పరిసరాల పరిశుభ్రతలో సింగరేణి యాజమాన్యం క్రియాశీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. దోమల వల్ల డెంగ్యూ, మలేరియా, చికెన్‌ గున్యా లాంటి వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున, వాటి నివారణకు యాజమాన్యం అనేక చర్యలు చేపడుతుందన్నారు.సంస్థ యాజమాన్యం చేపట్టే కొన్ని ముఖ్యమైన పనులు పారిశుద్ధ్య కార్యక్రమాలు పని ప్రదేశాలు,కాలనీలు, పరిసర ప్రాంతాలలో క్రమం తప్పకుండా చెత్తను తొలగించడం, మురుగునీటి పారుదల వ్యవస్థలను శుభ్రంగా ఉండేలా చూసుకోవాలని సూచించారు. నీరు నిలిచిపోయే ప్రాంతాలను గుర్తించి, వాటిని పూడ్చడం లేదా, నీరు నిలవకుండా చర్యలు తీసుకోవాలని, వ్యర్థాలను తొలగించేందుకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. కీటక నాశినిల పిచికారీ (ఫాగింగ్) దోమల లార్వాలను, వయోజన దోమలను నిర్మూలించడానికి, క్రమం తప్పకుండా పిచికారీ చేయడం మంచిదని, ముఖ్యంగా వర్షాకాలంలో, దోమల బెడద ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో దీనికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. అలాగేదోమల ద్వారా సంక్రమించే వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండటం, వ్యాధుల లక్షణాలు కనిపించిన వారు సత్వర వైద్య సహాయం పొందాలన్నారు. వ్యాధుల వ్యాప్తిని నిరోధించడానికి నిరంతర నిఘా వ్యవస్థను ఏర్పాటు చేయడం మంచిదని, అలాగే స్తానిక అధికారులు పారిశుద్ధ్య కార్యక్రమాలలో కార్మికులను భాగస్వాములను చేయడం. వారి సహకారాన్ని తీసుకోవడం ద్వారా, కార్యక్రమాలు మరింత సమర్థవంతంగా అమలు జరుగుతుందని, ఆమె అభిప్రాయపడ్డారు. ఇక ఈ చర్యల ద్వారా కార్మికులకు, వారి కుటుంబాలకు ఆరోగ్యకరమైన, సురక్షితమైన వాతావరణాన్ని కల్పించడం జరుగుతుందని, తద్వారా ఉద్యోగుల పనితీరు మెరుగుపడుతుందని డాక్టర్ పద్మావతి అభిప్రాయపడ్డారు.

Leave A Reply

Your email address will not be published.