- కలెక్టర్ బి. సత్య ప్రసాద్
ముద్ర ప్రతినిధి, జగిత్యాల: జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా జరుగుతుందని, కొనుగోలు కేంద్రాలకు వచ్చే నాణ్యమైన ధాన్యాన్ని వేగవంతంగా కొనుగోలు చేయాలని జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ అన్నారు. మంగళవారం మెట్పల్లి మండలం ఆరపేట, ఇబ్రహీంపట్నం మండలం వర్షకొండ, మల్లాపూర్ మండల్ సాతారం గ్రామాల్లో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్.ఆకస్మికంగా తనిఖీ చేశారు. కొనుగోలు కేంద్రంలో ధాన్యం కొనుగోలు వివరాలు, అధికారులను అడిగి తెలుసుకున్నారు.వడగళ్ల వర్షాలు పడే అవకాశాలు ఉన్నందున అందుబాటులో తార్పలిన్ కవర్లు ఉండాలని అన్నారు. కొనుగోలు చేసిన ధాన్యం ను వెంటనే మిల్లులకు పంపించాలని జిల్లా కలెక్టర్ సూచించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జగిత్యాల జిల్లాలోని ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా జరుగుతుందని, కొనుగోలు కేంద్రాలకు వచ్చిన నాణ్యమైన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి మిల్లులకు తరలిస్తున్నామని, ప్రతిరోజు మిల్లులకు పంపాలి, రవాణా నిమిత్తం లారీల కొరత ఎక్కడా లేదని జిల్లా కలెక్టర్ తెలిపారు. రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేసిన ధాన్యం వివరాలను ఎప్పటికప్పుడు ట్యాబ్ ఎంట్రీ పూర్తి చేయాలని అన్నారు. కొనుగోలు కేంద్రాలకు వచ్చే ధాన్యం 17 తేమ శాతం రాగానే కాంటా వేసి కొనుగోలు చేసి సంబంధిత మిల్లులకు తరలించాలని అన్నారు. ధాన్యం రవాణా అంశంలో వాహనాల కొరత, హామా లీల సమస్య రాకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని జిల్లాలో కొనుగోలు కేంద్రాల వద్ద అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.ఈ తనిఖీల్లో జిల్లా కలెక్టర్ వెంట మెట్పల్లి రెవెన్యూ డివిజనల్ అధికారి శ్రీనివాస్, డీ ఎస్ ఓ, డి ఎం, తహసిల్దార్లు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
