ముద్ర, హైదరాబాద్ :
సి ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో డాక్టర్ వశిష్ట శర్మ వేణుగాన మరియు గాత్ర కచేరీతో వృద్ధాశ్రమ వాసులకు సంగీతానందాన్ని పంచారు. తన వేణు గాన మాధుర్యంతో ఆయన అక్కడి వృద్ధులకు వీనుల విందు చేశారు.
వృత్తి రీత్యా వైద్యుడైన డాక్టర్ వశిష్ట శర్మకు సంగీతంపై ఉన్న అపారమైన ప్రేమతో వేణువు వాద్యంలో ప్రావీణ్యం సంపాదించారు. 2020లో ప్రారంభమైన ఆయన సంగీత ప్రయాణం భక్తి కచేరీలు, ప్రత్యక్ష ప్రదర్శనలు, సంగీత రికార్డింగ్ల ద్వారా కొనసాగుతోంది. విద్యా నైపుణ్యాన్ని కళాత్మక భక్తితో మిళితం చేస్తూ సంగీత సేవ చేస్తున్నారు.
ఈ సందర్భంగా సి ఆర్ ఫౌండేషన్ గౌరవ అధ్యక్షుడు డాక్టర్ కె. నారాయణ డాక్టర్ వశిష్ట శర్మను శాలువాతో సత్కరించారు. ఇటీవలే వైద్య విద్య పూర్తి చేసి ఎండీఎస్‌కు సన్నద్ధమవుతున్నప్పటికీ వేణు వాద్యంలో మంచి పట్టును సాధించడం అభినందనీయం అని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఆయన ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆశీర్వదించారు.
కార్యక్రమానికి వృద్ధాశ్రమ డైరెక్టర్ వి. చెన్నకేశవరావు స్వాగతం పలికారు. సి ఆర్ ఫౌండేషన్ ఉపాధ్యక్షుడు కంభంపాటి అజయ్ కుమార్ వందన సమర్పణ చేశారు.
ఈ కార్యక్రమంలో పాలి క్లినిక్ డైరెక్టర్ డాక్టర్ కె. రజిని, మహిళా సంక్షేమ కేంద్ర డైరెక్టర్ జ్యోస్యబట్ల కల్పన, సభ్యురాలు వయ్యకంటి లలిత, వంకా లక్ష్మి, హోం కమిటీ సభ్యులు చెన్నమనేని వెంకటేశ్వరరావు, తానియా, ఎన్. రాజేందర్ రావు, హోం మేనేజర్ శ్రీనివాస్, ఆశ్రమ వాసులు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆశ్రమ వాసులు మల్లంపాటి వెంకటేశ్వరరావు, యలమంచిలి దుర్గాప్రసాద్, చెన్నమనేని వెంకట్రామరావులు డాక్టర్ వశిష్ట శర్మను ఆశీర్వదించారు.