Take a fresh look at your lifestyle.

తగ్గని జీవన్ రెడ్డి.. ఈ నెల 25న పార్టీకి గుడ్ బై..?

 

జీవన్ రెడ్డిని బుజ్జగించిన మంత్రులు తగ్గని సీనియర్ నేత తెరపైకి బీజేపీ సంప్రదింపులు

ముద్ర, తెలంగాణ బ్యూరో :

పార్టీని వీడేందుకు సిద్ధమైన సీనియర్ నేత జీవన్ రెడ్డి వెనక్కి తగ్గడం లేదు. ఏఐసీసీ రాష్ట్ర ఇంచార్జ్ మీనాక్షి ఆదేశాలతో మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ వెళ్లి బుజ్జగించినా ఆయన వినడం లేదని తెలుస్తోంది. దాదాపు 5 గంటలపాటు చర్చించారు. తన సొంత కేడర్ కు అన్యాయం జరుగుతుందని, తాను పార్టీలో ఉండనంటూ జీవన్ రెడ్డి తెగేసి చెప్పినట్లు సమాచారం. ఇదే విషయాన్ని మంత్రులు.. మీనాక్షికి చెప్పినట్లు పార్టీ కీలక నేత చెప్పారు. ఈ నెల 25న జీవన్ రెడ్డి పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారని అంటున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత సీనియర్ నాయకుడైన టి. జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పేందుకు సిద్ధమయ్యారు. ఆయనను బుజ్జగించేందుకు సీనియర్ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు.
నలభై ఏళ్ల పాటు కాంగ్రెస్ జెండాను మోసిన సీనియర్ నేత, ఎమ్మెల్సీ టి. జీవన్ రెడ్డి ఇప్పుడు పార్టీని వీడే దిశగా అడుగులు వేస్తున్నారు. జగిత్యాల నియోజకవర్గంలో తనకు చిరకాల ప్రత్యర్థిగా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌ను పార్టీలోకి చేర్చుకోవడం, ఆపై ఆయనకే ప్రాధాన్యత ఇవ్వడంపై జీవన్ రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. తనకు పార్టీలో గౌరవం లేదని, అవమానాలు ఎదురవుతున్నాయని భావిస్తున్న ఆయన, ఈ నెల 25వ తేదీన కాంగ్రెస్‌కు అధికారికంగా రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆయన ఇంటి వద్ద కాంగ్రెస్ ఫ్లెక్సీలను అనుచరులు తొలగించడం ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూరుస్తోంది.

మంత్రుల బుజ్జగింపులు – తగ్గని జీవన్ రెడ్డి జీవన్ రెడ్డిని బుజ్జగించేందుకు కాంగ్రెస్ అధిష్టానం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆయనతో గంటల తరబడి చర్చలు జరిపారు. పార్టీలో మీ ప్రాధాన్యత తగ్గదు, తగిన గుర్తింపు ఇస్తాం అని మంత్రులు నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ, ఆయన మనసు మార్చుకోలేదని తెలుస్తోంది. తన సొంత కేడర్‌కు అన్యాయం జరుగుతున్నప్పుడు పదవుల్లో కొనసాగడం వృథా అని ఆయన మంత్రుల వద్ద కుండబద్దలు కొట్టినట్లు సమాచారం. దాదాపు గంటన్నర పాటు జరిగిన ఈ భేటీ నిష్ఫలమైందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.
బీఆర్ఎస్‌లో చేరుతారని ప్రచారం
ఈ పరిణామాల నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీలు జీవన్ రెడ్డిపై కన్నేశాయి. అటు బీఆర్ఎస్ , ఇటు బీజేపీ ఆయనను తమ పార్టీలోకి ఆహ్వానించేందుకు పావులు కదుపుతున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌లతో జీవన్ రెడ్డి టచ్‌లోకి వెళ్లారని, 25న రాజీనామా చేసిన వెంటనే జగిత్యాలలో భారీ బహిరంగ సభ ద్వారా గులాబీ కండువా కప్పుకునే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. కేసీఆర్ కూడా జీవన్ రెడ్డి సీనియారిటీని గౌరవించి, ఆయనకు సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.

సంప్రదింపులు జరుపుతున్న బీజేపీ
బీజేపీ కూడా ఆయన వంటి క్లీన్ ఇమేజ్ ఉన్న నాయకుడి కోసం గట్టి ప్రయత్నాలే చేస్తోంది. కరీంనగర్ రీజియన్‌లో జీవన్ రెడ్డికి ఉన్న పట్టును గమనించి, ఆయనను తమ వైపు తిప్పుకుంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో తిరుగుండదని కమలనాథులు భావిస్తున్నారు. మొత్తానికి జగిత్యాల రాజకీయాలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠను రేపుతున్నాయి.

Leave A Reply

Your email address will not be published.