రెండో వాహనం కొంటే అదనపు ట్యాక్స్ కు బ్రేక్ ఈ నెల 23 నుంచి వాహన్ లో తెలంగాణ
ముద్ర, తెలంగాణ బ్యూరో :
తెలంగాణలో రెండో వాహనం కొనుగోలుపై అదనంగా విధిస్తున్న 2 శాతం లైఫ్ ట్యాక్స్‌ను రద్దు చేస్తూ రవాణా శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 23 నుంచి ఇది అమల్లోకి రానుంది. అదే రోజున రాష్ట్ర వాహనాల డేటాను కేంద్ర ప్రభుత్వ ‘వాహన్’ పోర్టల్‌తో మంత్రి పొన్నం ప్రభాకర్ అనుసంధానం చేయనున్నారు. దీనివల్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియలో పారదర్శకత పెరగడమే కాకుండా జాతీయ డేటాబేస్‌లో తెలంగాణ వాహనాల వివరాలు అందుబాటులోకి వస్తాయి.
ఇప్పటికే ఒక వాహనం ఉండి.. మరో వాహనం కొనుగోలు చేయాలనుకునేవారికి గుడ్‌న్యూస్. రెండో వాహనం రిజిస్ట్రేషన్‌పై అదనంగా విధిస్తున్న 2 శాతం లైఫ్ ట్యాక్స్‌ను రద్దు చేయబోతున్నట్లు తెలంగాణ రవాణాశాఖ ప్రకటించింది. ఈ తాజా నిర్ణయం మార్చి 23 నుంచి అమల్లోకి వస్తుందని అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలో ప్రజలకు పాదదర్శక, వేగవంతమైన సేవల్ని అందించబోతున్నామని రవాణాశాఖ అధికారులు తెలిపారు. ఇందుకు వీలు కల్పించే కేంద్ర ప్రభుత్వ వాహన్ పోర్టల్‌తో తెలంగాణలోని వాహనాల డేటాబేస్‌ను రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ 23న జరిగే కార్యక్రమంలో అనుసంధానం చేస్తారని చెప్పారు. వాహన్ పోర్టల్ ద్వారా దేశవ్యాప్త వాహనాల సమాచారం ఒకే చోట లభ్యమవుతుందని వెల్లడించారు. కేంద్రప్రభుత్వ వాహన్ పోర్టల్‌తో అనుసంధానం కావడంతో తెలంగాణకు చెందిన వాహనాల వివరాలు జాతీయ డేటాబేస్‌లోకి వెళ్తాయని అన్నారు.
ఇప్పటి వరకు తెలంగాణ ప్రభుత్వం సొంత ఐటీ వ్యవస్థపైనే ఆధారపడటంతో జాతీయ నెట్‌వర్క్‌కు దూరంగా ఉంది. తాజాగా.. కేంద్ర ప్రభుత్వ ఫ్లాగ్‌షిప్ డిజిటల్ ప్లాట్‌ఫారమ్ ‘వాహన్’ పోర్టల్‌లో చేరేందుకు రెడీ అయింది. ఇప్పటికే లైసెన్సుల జారీ కోసం సారథి పోర్టల్ అమలు చేయగా.. ఇప్పుడు వాహన రిజిస్ట్రేషన్ల కోసం కొత్తగా వాహన్‌ను అనుసంధానించనుంది. దీంతో అంతరాష్ట్ర వాహనాల కొనుగోలు చేస్తే రిజిస్ట్రేషన్ ఈజీ కానుంది. తెలంగాణలో రిజిస్టర్ అయిన వాహనాన్ని ఇతర రాష్ట్రాలకు తీసుకెళ్లినా.. అక్కడి వారు ఇక్కడ వాహనాలను కొనుగోలు చేసినా అవసరమైన పత్రాల కోసం గతంలో ఆర్టీఏ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వచ్చేది. ఇక నుంచి వాహన్ పోర్టల్ ద్వారా కేంద్ర సర్వర్‌లో డేటా అందుబాటులో ఉంటుంది. దీన్ని వల్ల ఎన్ఓవో వంటి సాంకేతిక ప్రక్రియలు సెకన్ల వ్యవధిలోనే ఆన్‌లైన్ వేదికగా పూర్తి కానున్నాయి.
దాంతో పాటు వెహికల్ యజమాని అడ్రస్ మార్పు, డూప్లికేట్ ఆర్సీ, రిమూవల్ వంటి పనులు ఆర్టీఏ ఆఫీసులకు వెళ్లకుండా నేరుగా ఆన్‌లైన్‌లోనే చేసుకోవచ్చు. ఎవరైనా సెకండ్ హ్యాండ్ వెహికల్స్ కొనుగోలు చేయాలనుకుంటే ఆ వాహనం గత చరిత్ర, పెండింగ్ చలాన్లు, ఇంజిన్ ఛాసిస్ నంబర్లను సులభంగా సరిచూసుకోవచ్చు. రోడ్ ట్యాక్స్ చెల్లింపులు, ఈ-చలానాల ప్రక్రియ కూడా వేగవంతం అవుతుంది. వాహన్ పోర్టల్‌లో చేరటం వల్ల నేర నియంత్రణలోనూ పోలీసులకు వెసులుబాటు కలుగుతుంది. చోరీకి గురైన వాహనాలు ఇతర రాష్ట్రాల్లో అమ్మకానికి వచ్చినా.. వాటి గుర్తింపు వెంటనే తెలుస్తుంది.