మహాదేవపూర్, ముద్ర:
సరస్వతీ, గోదావరి పుష్కరాలు నిర్వహించనున్న తరుణంలో పవిత్ర పుణ్యక్షేత్రమైన శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవస్థానంలో పలు అభివృద్ధి, గర్భాలయ పునరుద్ధరణ కోసం కొరకు ప్రభుత్వం మంజూరు చేసిన రూ. 200 కోట్ల పనులకు సోమవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. పుష్కరాలను దృష్టిలో ఉంచుకొని 35 కోట్లతో నిర్మించనున్న నూతన బస్టాండ్ కు రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. హెలికాప్టర్లో కాళేశ్వరం చేరుకున్న సిఎం రేవంత్ రెడ్డి, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఉత్తంకుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, లకు ఐటి పరిశ్రమల శాఖామంత్రి ఘన స్వాగతం పలికారు.

ప్రధాన పూజారి పనగంటి నాగఫణి శర్మతో పాటు అర్చక బృందం సీఎం రేవంత్ రెడ్డికి పూర్ణకుంభ స్వాగతం పలికారు. వీరితో ఎన్డీఎస్ఎ చైర్మన్ అనిల్ జైన్ కూడా ఉన్నారు.

శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి వారిని దర్శించుకుని, అభిషేకం పూజలు నిర్వహించిన అనంతరం శుభానంద దేవి అమ్మవారిని దర్శించుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో పాటు మంత్రులకు వేద పండితులు ఆశీర్వచనం పలికి స్వామి వారి శేష వస్త్రాలు, స్వామి వారి చిత్రపటాన్ని బహుకరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. శ్రీధర్ బాబు వెంట మంత్రులు అడ్లురి లక్ష్మణ్ కుమార్, గడ్డం వివేక్ వెంకటస్వామి, ఎంపీ వంశీకృష్ణ, దేవాదాయ ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజా రామయ్యర్, ఎండోమెంట్ కమిషనర్ హనుమంత రావు, వాస్తు శిల్పి గోవిందహరి, ఈవో మహేష్, కాళేశ్వరం సర్పంచ్ వెన్నపురెడ్డి మోహన్ రెడ్డి లు ఉన్నారు.