Take a fresh look at your lifestyle.

కమలా నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యాలయంలో అగ్నిప్రమాదం

 

రూ.8 లక్షల ఆస్తి నష్టం,

అనుమానాస్పద ఘటనపై కాలనీ వాసుల ఆగ్రహం

ముద్ర : కాప్రా

కాప్రా సర్కిల్ పరిధిలోని సౌత్ కమలా నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యాలయంలో బుధవారం అనుమానాస్పద అగ్నిప్రమాదం సంభవించింది. స్థానిక అసోసియేషన్ సభ్యులు, కాలనీ వాసులు అప్రమత్తమై మొదట మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. అనంతరం అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజన్ సహాయంతో సంఘటనా స్థలానికి చేరుకుని పూర్తిగా మంటలను అదుపులోకి తెచ్చారు.


ఈ ఘటనలో కార్యాలయంలోని ఫర్నిచర్, పత్రాలు , ఇతర సామగ్రి దగ్ధమవడంతో సుమారు రూ.8 లక్షల మేర ఆస్తి నష్టం జరిగినట్లు ప్రాథమిక అంచనా వెల్లడైంది.
స్థానికుల ప్రకారం ఈ అగ్నిప్రమాదం అనుమానాస్పదంగా కనిపిస్తోందని తెలిపారు. ఇటీవల వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ సభ్యులు రెండు వర్గాలుగా చీలి వివాదాలు నెలకొన్న నేపథ్యంలో ఈ ఘటన జరిగిందని కాలనీవాసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సంఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
అసోసియేషన్ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం, సుమారు 12:30 గంటల వరకు కార్యాలయంలోనే ఉన్నామని, అనంతరం ఇంటికి వెళ్లిన కొద్ది సమయంలోనే అగ్నిప్రమాదం జరిగిందని చెప్పారు.
ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు అసోసియేషన్ నాయకులు రాఘవరెడ్డి,సభ్యులు, వెల్లడించారు. అగ్నిప్రమాదానికి కారణమైన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని వారు ప్రభుత్వాన్ని , పోలీసులను కోరుతున్నారు.
ఈ సంఘటనతో సౌత్ కమలా నగర్ కాలనీలో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించి అగ్నిప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టనున్నారు.

Leave A Reply

Your email address will not be published.