- మే 25 ఆదివారం తో రోహిణి కార్తి ఆరంభం.
- నాసిరకం వరి విత్తనాలు పురుగుమందులు కలుపు మందులతో నష్టపోతున్న రైతాంగం.
- విత్తన దుకాణదారుల అక్రమాలను అరికట్టాలంటున్న రైతాంగం.
- నాసిరకం విత్తనాలు పురుగుమందులు ఎరువులను అధికారులు తనిఖీలలో గుర్తించాలని కోరుతున్న రైతాంగం.
- ఎరువులు పురుగు మందులు విత్తనాల దుకాణాల ముందు రైతులకు అర్థమయ్యేలా బోర్డులు ఉండేలా చూడాలి.
- వరి కలుపు మందుల గోల్మాల్ అరికట్టాలి.
- సీజన్ ఆరంభంలో తనిఖీ మొదలుపెట్టిన వ్యవసాయ శాఖ.
ముద్ర,తుంగతుర్తి : ఖరీఫ్ సీజన్ మే 25 ఆదివారం రోహిణి కార్తె ఆరంభంతో ప్రారంభం కానుంది. యావత్తు రైతాంగం రోహిణి కార్తీ నుండి నారుమడులు దున్నకాలు ప్రారంభిస్తారు. ముఖ్యంగా రైతాంగం రోహిణి కార్తెల్లో వరి నార్లు పోస్తే పంట దిగుబడి బాగా వస్తుందని చీడపీడలు తక్కువగా ఉంటాయని అనాదిగా రైతాంగం నమ్మకం .ఈ ఏడాది వానాకాలం రోహిణి కార్తె 25వ తేదీ ఆదివారం నుండి ప్రారంభం కానుంది. ఇప్పటికే రైతులు వరి విత్తనాలు సిద్ధం చేసుకుంటున్నారు.కొంతమంది రైతులు నారుమడుల దున్నకాలు ప్రారంభించారు. విత్తన దుకాణాలలో పలు రకాల వరి విత్తనాలు అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి. నాణ్యమైన వరి విత్తనాలు విత్తన దుకాణదారులు అమ్మకాలు చేయాల్సి ఉంటుంది. కాగా తుంగతుర్తి మండలం లో ప్రతి సంవత్సరం కొంతమంది రైతులకు నాసిరకమైన వరి విత్తనాలు రావడం,పోసి నష్టపోవడం జరుగుతూనే ఉంది. రైతులు తమ వరి విత్తనాలు మొలకలు రాలేదు అనగానే దుకాణదారులు విషయం బయటకు రాకుండా అదే రైతులతో మాట్లాడుకుని నష్టపరిహారాలి ఇవ్వడం పరిపాటిగా మారింది. ఏ ఒక్క విత్తన విక్రయ దుకాణం పై కూడా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. గడచిన దశాబ్ద కాలంగా ఇదే తంతు కొనసాగుతోంది.వరి విత్తనాల నాణ్యతను సంబంధిత శాఖ అధికారులు పరిశీలించాల్సి ఉంటుంది.తాము పరిశీలించామని వరి నార్లు మొలకలు సరిగా రాలేదని రైతులు తమ దృష్టికి తెలియదనడం ఆ శాఖ అధికారులకు అలవాటుగానే మారింది. ఖరీఫ్ సీజన్ కి ముందు మండలంలో ఏ రకాల విత్తనాలు అమ్మకానికి వచ్చాయో వాటి ధరలు ఏ విధంగా ఉన్నాయో రైతులకు తెలపాల్సి ఉంది.ప్రతి దుకాణం ముందు ఆయా రకాలకు సంబంధించిన బోర్డులు ధరలతో సహా ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.విత్తన దుకాణా దారులు విధిగా తాము తెచ్చిన వరి విత్తనాలు పత్తి విత్తనాల రకాలను వ్యవసాయ శాఖ అధికారుల ముందు వాటి వివరాలు తెలపాల్సి ఉంటుంది. కొంతమంది విత్తన దుకాణదారులు పత్తి విత్తనాలు తాము తెచ్చి విక్రయించినప్పటికీ సంబంధిత శాఖ అధికారులకు తెలపకపోవడం అనాదిగా వస్తున్న తీరు.తీర రైతులు తమకు విత్తనాలు రావడం లేదని అధికారులతో చెప్పినప్పుడు హడావిడిగా తనిఖీలు చేయడం అంతా సజావుగానే ఉందని చెప్పడం ప్రతి ఏటా జరిగే తంతే.ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ ప్రారంభంలోనే సంబంధిత శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు.అందులో భాగంగా శనివారం తుంగతుర్తి మండల కేంద్రంలోని పలు దుకాణాలను తనిఖీలు చేశారు.గత సంవత్సరం రైతాంగం ముఖ్యంగా వరిలో వచ్చే కలుపు నివారణ మందులు కొనుగోలు చేసి తీవ్రంగా నష్టపోయారు.ఒక్కో ఎకరానికి సుమారు నాలుగువేల రూపాయలకు పైగా కలుపు మందులు కొనుగోలు చేసి వరి పంటపై పిచికారి చేసిన వరిలోని కలువు మాత్రం చావలేదని రైతులు చెబుతున్నారు.మరి కలుపు మందుల లోపమా ?లేక కలుపు గట్టితనమా ?వ్యవసాయ శాఖ అధికారులు చెప్పాల్సి ఉంది.ఒక్కో రైతు అదే దుకాణం నుండి రెండుసార్లు కలుపు మందులు తీసుకువెళ్లి పిచికారి చేసిన కలువు మాత్రం చావకపోవడం గమనార్హం.ఇది ఒకరో ఇద్దరూ రైతులు చెప్పేదికాదు దాదాపు అధిక శాతం మంది రైతులు గత సంవత్సరం పడిన బాధ కలుపు చావకపోవడంతో దిగుబడి ఇబ్బడి ముబడిగా తగ్గిపోయింది.కలుపు మందులకు మాత్రం ధర పెరిగిపోయింది.ఒక్కొక్క దుకాణానికి ఒక తీరు ధరతో అమ్మకాలు సాగించారు.వరిలో కలుపు మందులను బొద్దు ఉన్నదా, గరక ఉన్నదా, దారుక ఉన్నదా, తుంగ ఉన్నదా, అని రకరకాల పేర్లను అడిగి వేలాది రూపాయల కలుపు మందులు రైతులకు అంట కడుతున్న సంబంధిత శాఖ కిమ్మనక పోవడం గమనార్హం.పురుగుమందుల విషయానికి వస్తే అధికారులకు సూచించే మందులు ఒక తీరు అయితే దుకాణాలలో లోపాయి కారిగా నాసిరకం మందుల అమ్మకాలు పలుసార్లు పలు దుకాణాలలో పట్టుబడిన లోపాయి కారి ఒప్పందాలతో దుకాణాల దారులు కేసుల నుండి తప్పించుకున్న సంఘటనలు గతంలో జరిగాయి.తిరిగి వ్యవసాయ సీజన్ ప్రారంభమైంది.ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు ప్రతి దుకాణాన్ని క్షుణ్ణంగా పరిశీలించి దుకాణానికి సంబంధించిన గోదాములను సైతం తనిఖీ చేసి వారు అమ్మే విత్తనాలు ఎరువులు పురుగు మందులు నాణ్యమైన వా కావా పరిశీలించి రైతులకు అన్యాయం జరగకుండా చూడాల్సి ఉందని యావత్ రైతాంగం కోరుతుంది.వరిలో కలుపు నాసిని కలుపు మందుల విషయంలో కూడా వ్యవసాయ శాఖ వారు సరియైన దృష్టి సారించాలని దుకాణాల లో జరుగుతున్న మోసాలను దుకాణాదారుల మాటకారితనాన్ని అరికట్టాలని యావత్ రైతాంగం కోరుతుంది. ఆరుగాలంకస్టించే రైతాంగానికి అధికారులు అండగా నిలవాలని కోరుతున్నారు.
