Take a fresh look at your lifestyle.

ఘనంగా మహా పూర్ణాహుతి, చక్రతీర్ధం

ముద్ర ప్రతినిధి, భువనగిరి :
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి  బ్రహ్మోత్సవాలలో భాగంగా శుక్రవారం ఉదయం శ్రీ స్వామివారి ఆలయంలో నిత్యారాదనల అనంతరం మహా పూర్ణాహుతి, చక్రతీర్ధం కార్యక్రమాలను శ్రీ పాంచరాత్రాగమ శాస్త్రానుసారముగా ఆలయప్రధానార్చకులు, ఉపప్రధానార్చకులు, యజ్ఞాచార్యులు, వేదపండితులు, అర్చకటృందం పారాయణీకులు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలలో దేవాదాయ ధర్మాదాయ శాఖ డైరెక్టరు ఎమ్. హనుమంతరావు, కార్యనిర్వహణాధికారి జె.భవానీశంకర్, ఆలయ అనువంశికధర్మకర్త బి. నరసింహామూర్తి, ఉపకార్యనిర్వహణాధికారిగారు, సహాయ కార్యనిర్వహణాధికారులు, పర్యవేక్షకులు, ఉద్యోగ సిబ్బంది, భక్తులు పాల్గొని శ్రీ స్వామివారిని దర్శించుకున్నారు.

మహాపూర్ణాహుతి ప్రత్యేకత

“ఓం పూర్ణమద: పూర్ణమిదః పూర్ణాత్ పూర్ణముదచ్యతే” అని సంకల్పించి పూర్ణాహుతి ఫలమును భగవత్ అర్పణము గావించి సమస్త లోకములు సుఖ శాంతి మయములు కావాలని కోరుకొనుచూ, వసోర్ధార మొదలగు మంత్రములతో లోకములో సువృష్టిని కురిపించమని భగవానుని వేడుకొని ఎంతో భక్తిభరితంగా ఈ కార్యక్రమమును నిర్వహించెదరు.

చక్రతీర్ధము ప్రత్యేకత

శ్రీ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవములలో చక్రతీర్ధము (అవభృథ మహోత్సవము) ఎంతో ప్రత్యేకతను కలిగి ఉన్నది. శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్లను ప్రతినిత్యము ఆగమశాస్త్రానుసారంగా ఆరాధన నిర్వహించి ఉత్సవాంతమున పంచామృత స్నపన తిరుమంజన
వేడుకలు నిర్వహించి అనంతరము శ్రీ స్వామివారి పుష్కరిణిలో పవిత్ర స్నానము గావించిన సుదర్శన చక్ర ప్రభావం వలన తీర్థరాజము అత్యంత పవిత్రతను పొందును. ఈ జలములలో భక్తులు స్పా నామాచరించిన ఎంతో పుణ్య ప్రదమని శాస్త్రోక్తము

సాయంకాల కార్యక్రమాలు

శుక్రవారం సాయంకాలం శ్రీ స్వామివారి ఆలయంలో నిత్యారాధనల అనంతరం శ్రీపుష్పయాగము, దేవతోద్వాసన, దోపు ఉత్సవము కార్యక్రమములను ఆలయ ప్రధానార్చకులు, ఉప ప్రధానార్చకులు, యజ్ఞాచార్యులు, అర్చక బృందం, వేద పండితులు, పారాయణీకులు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలో ఆలయ అధికారులు, ఉద్యోగ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.

శ్రీ పుష్ప యాగము ప్రత్యేకత

బ్రహ్మోత్సవములో తెలిసి తెలియక జరిగిన సర్వవిధ దోషములను తొలగించుటకు గాను ప్రాయశ్చిత్తముగా ఈ పుష్పయాగము నిర్వహించెదరు. పుష్పము పరిమళము రెండును భగవంతుని స్వరూపమని వాటిని భక్తిపూర్వకంగా భగవంతునికి సమర్పించిన జన్మరాహిత్యం కలుగునని కపింజల సంహిత తెలియజేయుచున్నది. ఉత్సవాల దేవుడికి నిర్వహించబడు శ్రీ పుష్పయాగ మహోత్సవమునకు దేవకోటి విచ్చేసి వీక్షించి అనుగ్రహం పొందుట పురాణ ప్రసిద్ధము.

దేవతోద్వాసన విశిష్టత

బ్రహ్మోత్సవములకు ఆహ్వానించబడిన దేవతలకు మహాపూర్ణాహుతితో హవిస్సులు అందజేసి వారికి ప్రీతికరములైన రాగములతో మేళతాళముల మద్య వారి స్వస్థలములకు పంపి ప్రక్రియనే దేవతోద్వాసన, ఈ వేడుక ద్వారా ఆనంద భరితులైన ముక్కోటి దేవతలు సువృష్ఠిని శాంతిని చేకూర్చగలరని పురాణోక్తి.

దోపు ఉత్సవము ప్రత్యేకత

భగవత్ సేవ కన్నా భాగవత తదియారాధన మిన్న అని తలచిన తిరుమంగైయాళ్వార్ అను పరమ భక్తుడు తన సర్వస్వమును రాజ్యమును వెచ్చించి తదియారాధన నిర్వహించిరి. సంపద సరిపడక సర్వాలంకార భూషితురాలైన అమ్మవారి ఆభరణములు దొంగిలించుటకు ప్రయత్నించి అమ్మవారి పాదమెట్టెలను నోటితో స్పృశించగా జ్ఞానము కలిగి భగవత్ భక్తిలో కడతేరిన వృత్తాంతం ఈ దోపు ఉత్సవములో వివరించెదరు.

Leave A Reply

Your email address will not be published.